Thursday Motivation: ప్రతికూల ఆలోచనలే అన్నిటికీ మూలం. సమస్య చిన్నదైనా కూడా ప్రతికూల ఆలోచనలు వచ్చాయంటే… ఆ సమస్య కొండంతలా కనిపిస్తుంది. సమస్యలు రాకుండా అడ్డుకోలేం… కానీ ఆలోచనలను మార్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. మీ చుట్టూ ముళ్ళు ఉన్నా కూడా మీరు సానుకూల ఆలోచనలు చేస్తే అవి పూలవనంలా కనిపిస్తాయి. వాటిని దాటుకుంటూ వెళ్లడం సులువుగా అనిపిస్తుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలను మాని, పాజిటివ్ ఆలోచనల వైపుగా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.

మెదడులో ప్రతికూల ఆలోచనలు ఎక్కువైతే మనకి మనమే బరువుగా మారిపోతాం. అదే అంతా సానుకూలంగా ఆలోచిస్తే గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతికూల భావోద్వేగాలు మిమ్మల్నే కాదు మీ చుట్టూ ఉన్న వారిని కూడా కాల్చేస్తాయి. వారి జీవితాలలోనూ ప్రశాంతతను లేకుండా చేస్తాయి. సానుకూల ఆలోచనలను మొదలుపెట్టడానికి కొన్ని చిట్కాలను పాటించండి.

ధ్యానమే మొదటి మెట్టు

సానుకూల ఆలోచనలు రావాలంటే మీ మెదడు, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. కానీ బిజీ జీవితాలలో మనసుకు, మెదడుకు సమయం దొరకడం కష్టమే. అయినా కూడా మీరే వీలు కల్పించుకొని మనసు, మెదడు కోసం ధ్యానం చేయడం ప్రారంభించండి. రోజుకు 20 నిమిషాలు చేస్తే చాలు… సానుకూలత మీ శరీరంలో మొదలవుతుంది. మీ మానసిక దృష్టిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయో.. ఆలోచనలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి.

కృతజ్ఞతగా ఉండండి

ఎదుటివారు ఎప్పుడూ మిమ్మల్యే మెచ్చుకోవాలని కోరుకోకండి. మీరు కూడా ఎదుటివారిలో మంచి లక్షణాలను గుర్తించి వారిని మెచ్చుకుంటూ ఉండండి. ఇది మీలో కూడా సానుకూల భావనలను పెంచుతుంది. మీ స్నేహితులు, సహోద్యోగుల విషయంలో ఇలా ప్రయత్నించండి. మీరు అభినందిస్తున్న కొద్దీ మీ మెదడులో ఆనంద హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి మీ మనస్తత్వాన్ని సాలుకూలంగా మారుస్తాయి.

లాఫ్టర్ యోగా

నవ్వు ఒక అదృష్టం. ప్రతి నిమిషం నవ్వే అదృష్టం అందరికి రాదు. దీన్ని ఒక యోగా అనుకోండి. లాఫ్టర్ యోగాను ప్రతిరోజు ప్రయత్నించండి. మీరు ఎంతగా నవ్వితే మీ మానసిక ఆరోగ్యం పై అంతగా సానుకూల ప్రభావం పడుతుంది. ఈ యోగాకు పెద్దగా కష్టపడక్కర్లేదు. కూర్చుని నవ్వుతూ ఉండడమే. ఎవరు ఏమనుకుంటారో అన్నది విడిచిపెట్టి పద్మాసనంలో కూర్చొని నవ్వడం ప్రారంభించండి. నవ్వు యోగా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

సానుకూల చర్చ

ప్రపంచంలో ఎన్నో చెడు పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా చర్చించకండి. మంచితో కూడిన పనులు, దయతో కూడిన వ్యవహారాల గురించే చర్చలు చేయండి. అలాగే అనుబంధాలు, స్నేహబంధాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడతాయి. అలాగే మీలో పాజిటివ్ ఆలోచనలను కలిగేలా చేస్తాయి. ఎప్పుడైతే మీకు సానుకూల ఆలోచనలు మొదలవుతాయో మీ జీవితం అంతా సాఫీగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. లేకుంటే చిన్నచిన్న కష్టాలు, సమస్యలు కూడా సముద్రమంత పెద్దవిగా కనిపిస్తాయి. వాటిని అతిగా ఊహించుకొని మానసిక ఆందోళనలు, డిప్రెషన్ వంటి రోగాలను తెచ్చుకునే అవకాశం ఉంటుంది.