NNS 24th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఏప్రిల్ 24) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ముఖానికి ముసుగు వేసుకుని పెళ్లి చేసుకుంటానని ఓ గుళ్లో మొక్కుకున్నానంటుంది మనోహరి. సరే అలాగే చెయ్​మని చెప్పి మనోహరిని త్వరగా రమ్మని వెళ్లిపోతుంది నిర్మల. తనకోసం వచ్చినవాళ్లు వెళ్లిపోయారని చెప్పినందుకు నీలను కోప్పడి త్వరగా ఎరుపు వస్త్రాన్ని తీసుకురమ్మని పంపిస్తుంది మనోహరి.

ఇంతలో పంతులు పెళ్లికూతురుని తీసుకురమ్మని అనడంతో మనోహరి వాళ్ల ఆచారం ప్రకారం ముసుగు వేసుకుని వస్తుందని చెబుతుంది నిర్మల. అదేంటీ.. రాహుకాలంలో పెళ్లి చేయమని అమృత ఘడియలు ఆసన్నమవుతున్నా ఇంకా రావడం లేదేంటి, పెళ్లి అమృత ఘడియల్లోనే అయ్యేలా ఉందే అనుకుంటాడు పంతులు. అప్పుడే అటుగా వచ్చిన రామ్మూర్తి, మంగళను చూసి వెంటనే వెళ్లి పలకరిస్తారు నిర్మల, శివరామ్.

తమ కూతురు ఎలాంటి తప్పు చేయదని చెబుతున్న రామ్మూర్తిని వారించి మాకు మిస్సమ్మ గురించి తెలుసండీ, మా కోడలు తర్వాత అంతటి మంచి మనసున్న మనిషి మిస్సమ్మనే అంటారు అమర్​ తల్లిదండ్రులు. భాగీని వెతుక్కుంటూ వచ్చామని చెప్పడంతో ఇప్పడివరకూ మిస్సమ్మ పెళ్లి మండపం దగ్గరే కనిపించిందని చెప్పి పెళ్లికి పిలవకపోయినందుకు ఏమనుకోవద్దు అంటారు.

ముసుగు వేసుకొని మండపంలోకి భాగమతి

ముహూర్తం దాటిపోతుంది త్వరగా పెళ్లికూతుర్ని తీసుకురండని పంతులు చెప్పడంతో పెళ్లికూతురుగా తయారైన భాగమతి ముసుగు వేసుకుని మండపంలోకి వస్తుంది. తన స్థానంలో వేరొకరు మండపంలోకి రావడం చూసి కంగారు పడుతుంది మనోహరి. పెళ్లి ఆపేందుకు పరిగెడుతుంది. కానీ అంతలో బిహారీ గ్యాంగ్​ కనపడటంతో వెనక్కి వెళ్లి దాక్కుంటుంది.

పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి కన్యాదానం చేయమని చెప్పడంతో తనకి తల్లిదండ్రులు లేరని అంటాడు అమర్​. అదేంటీ అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు.. రామ్మూర్తిగారు, మంగళగారు మీరు అమ్మాయి తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం చేయమని అడగడంతో అందరూ షాకవుతారు. మిస్సమ్మ ఏమైందంటూ పిల్లలు, రాథోడ్​ కంగారు పడతారు.

భాగమతితోనే అమర్ పెళ్లి

పెళ్లితంతు మొదలవుతుంది. తన చెల్లి శరీరంలో చేరి మరోసారి తన భర్తను పెళ్లాడుతున్న అరుంధతి మంచితనం గుర్తు చేసుకుంటాడు చిత్రగుప్తుడు. కన్యాదానం, జీలకర్ర బెల్లం.. ఒక్కోతంతు జరుగుతుంటూ ఉంటే మనోహరి ఏం చేయలేక రూమ్​లోనే అరుస్తూ ఉంటుంది. తన స్థానంలో ఉన్నది ఎవరైనా వాళ్ల అంతు చూస్తానని అంటుంది. కానీ భాగమతి రూపంలో ఉన్న అరుంధతి మెడలో మరోసారి తాళి కడతాడు అమర్​.

తనకోసం వచ్చిన వాళ్లు వెళ్లడంతో మండపంలోకి పరిగెడుతుంది మనోహరి. అప్పటికే అమర్​, భాగీకి పెళ్లి జరిగిపోతుంది. పెళ్లికూతురు స్థానంలో ఉన్నది మిస్సమ్మ అని తెలియక పిల్లలు బాధపడుతూ ఉంటారు. అమ్మాయికి బొట్టు పెట్టమని ముసుగు తీయమని చెబుతాడు పంతులు. ముసుగు తీయగానే మండపంలో ఉన్న అందరూ షాకవుతారు.

తన పక్కన కూర్చున్నది మిస్సమ్మ అని చూసి ఆశ్చర్యపోతాడు అమర్​. కోపంతో రగిలిపోతాడు. మా మేడం ఉండాల్సిన స్థానంలో మిస్సమ్మ ఉందేంటి అని కంగారు పడుతుంది నీల. ఎందుకు పెళ్లిపీటల మీద కూర్చుని ఆయనతో తాళి కట్టించుకున్నావని నిలదీస్తుంది మంగళ. మిస్సమ్మా.. నువ్వు ఇక్కడెందుకు ఉన్నావ్​, మనోహరి ఎక్కడుంది అని అడుగుతున్న నిర్మలకి ఏం చెప్పలేక మిన్నకుంటుంది భాగీ.

పరిగెత్తుకుంటూ వచ్చిన మనోహరి ఈ పెళ్లి చెల్లదు అని అరుస్తుంది. భాగమతి సమాధానంగా ఏం చెప్పనుంది? అరుంధతి ఆత్మ తన కుటుంబాన్ని విడిచి వెళ్లనుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!