Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్‍కుమార్ విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా నెగెటివ్ రోల్స్ చేస్తున్న ఆమె.. కొన్ని సినిమాల్లో సానుకూల పాత్రలు చేస్తున్నారు. అయితే, వరలక్ష్మికి ఇప్పటి వరకు విలన్ పాత్రలే ఎక్కువగా పేరు తెచ్చిపెట్టాయి. క్రాక్‍లో జయమ్మగా ఆమె చాలా ఫేమస్ అయ్యారు. కాగా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఇప్పుడు ‘శబరి’ చిత్రం పస్తోంది. మే 3వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. గత చిత్రాలతో పోలిస్తే శబరి మూవీలో తన పాత్ర కొత్తగా ఉంటుందని వరలక్ష్మి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మరికొన్ని విషయాలను వెల్లడించారు.

ఇలాంటి పాత్ర ముందెప్పుడూ చేయలేదు

తాను సాధారణంగా ఎక్కువగా నెగెటివ్, హడావుడి ఉండే పాత్రలు చేశానని, అయితే శబరిలో తన పాత్ర వాటికి భిన్నంగా ఉంటుందని వరలక్ష్మి శరత్‍కుమార్ చెప్పారు. ఈ చిత్రంలో తనను కొత్తగా చూస్తారని అన్నారు.

తన కూతురిని కాపాడుకునేందుకు ఆరాటపడే, ఏమైనా చేసే తల్లి పాత్రను శబరి మూవీలో చేశానని వరలక్ష్మి తెలిపారు. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిందని, ఉత్కంఠభరితంగా ఉంటుందని ఆమె అన్నారు.

శబరి చిత్రానికి అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, కొత్త డైరెక్టర్‌తో మూవీ చేయడం రిస్క్ అనిపించలేదా అనే విషయంపై కూడా వరలక్ష్మి స్పందించారు. లైఫ్ అంటేనే రిస్క్ అని, ఒకవేళ ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందనే నమ్మకం తనకు ఉందని ఆమె తెలిపారు. హనుమాన్‍ను కూడా చిన్న మూవీనే అనుకున్నారని, చాలా పెద్ద హిట్ అయింది కదా అని చెప్పారు.

శబరి చిత్రంలో స్క్రీన్‍ప్లే అత్యుత్తమంగా ఉంటుందని, ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందని వరలక్ష్మి శరత్‍కుమార్ చెప్పారు. ఫైట్లు కూడా చాలా సహజంగానే ఉంటాయని తెలిపారు. తనకు నచ్చిన పాత్ర చేస్తానని, ఇమేజ్ అలాంటివి పట్టించుకోనని ఆమె అన్నారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షుకులు చూస్తారని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు.

ఈ ఏడాదే పెళ్లి

వరలక్ష్మి శరత్‍కుమార్ మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో ఆమె ఎంగేజ్‍మెంట్ జరిగింది. అయితే, పెళ్లి ఎప్పుడు ఉంటుందని ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ ఏడాదిలోనే పెళ్లి జరుగుతుందని వరలక్ష్మి స్పష్టం చేశారు. 

కాబోయే భర్త నికోలై తన చిత్రాల గురించి ఏం చెప్తారనే ప్రశ్నకు వరలక్ష్మి శరత్ కుమార్ సరదాగా స్పందించారు. ఇప్పటి వరకు బాగున్నాయనే చెప్పారని, బాగోలేదని చెప్పే అవకాశం ఆయనకు లేదని నవ్వుతూ అన్నారు. శబరి చిత్రాన్ని మహేంద్ర కూండ్ల నిర్మించగా.. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. మే 3న ఈ మూవీ థియేటర్లలో కానుంది. ఇటీవలే వచ్చిన ‘నా చెయ్యి పట్టుకోవే’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

తమిళ స్టార్ శరత్‍కుమార్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మి తన టాలెంట్‍తో సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరంభంలో ఎక్కువగా తమిళ చిత్రాలు చేసిన ఆమె.. కొన్నేళ్లుగా తెలుగులో అధికంగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‍లోనే ఉంటున్నారు. హనుమాన్ చిత్రంలో హీరో తేజ సజ్జా అక్క పాత్ర చేసిన వరలక్ష్మి పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు.