Kalki Amitabh Bachchan 20 Acre Land: బాలీవుడ్ బిగ్ బి, స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు హిందీ చిత్రపరిశ్రమ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలోని అలీబాగ్‌లో 10,000 చదరపు అడుగుల స్థలాన్ని అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారట.

సరయూ ప్రాజెక్ట్

అభినందన్ లోధా (హెచ్ఓఏబీఎల్) హౌస్ నుంచి అమితాబ్ బచ్చన్ ఈ భూమిని రూ.10 కోట్లకు కొనుగోలు చేశారు. ఇంతకుముందు అయోధ్యలో నిర్మిస్తున్న 7 స్టార్ మిక్స్‌డ్ యూజ్ ఎన్ క్లేవ్ ది సరయూ ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ భూమిని కొన్న విషయం తెలిసిందే. ఇది కూడా అభినందన్ లోధా నుంచే కొన్నారు.

రామాలయానికి దగ్గరిగా

అయోధ్య రామాలయానికి 15 నిమిషాలు, అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఈ స్థలం ఉండటం విశేషం. ఇప్పుడు అలీబాగ్ అనే ద్వీపంలో అమితాబ్ 20 ఎకరాల విస్తీర్ణంలో స్థలం కొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమితాబ్ ఈ స్థలంలో ఇంటిని నిర్మించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

డిమాండ్ పెరగడం

ఇక్కడ 10,000 చదరపు అడుగులతో నిర్మించే ప్లాట్‌ విలువ రూ .14.5 కోట్లు అని రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లగ్జరీ రిట్రీట్స్, ఇన్వెస్ట్ మెంట్ అవకాశాలను కోరుకునే హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్ఐలు) ఇష్టపడే రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా అలీబాగ్ అవతరించింది. ముంబైకి దగ్గరగా ఉండటం, బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, తీరప్రాంత భూభాగంతో ఈ మధ్య ఈ ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది.

షారుక్ ఖాన్ కూతురు కూడా

కాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అలీబాగ్‌లోని థాల్ గ్రామంలోని వ్యవసాయ భూమిని రూ.9.5 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే షారుక్ ఖాన్ కూడా గత సంవత్సరం రాయ్ గఢ్ జిల్లా అలీబాగ్‌లో మూడు నిర్మాణాలతో కూడిన 1.5 ఎకరాల భూమిని రూ. 12.91 కోట్లకు కొన్నారు.

విరాట్ దంపతుల బంగ్లా

ఫిబ్రవరి 2023లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు ఆవాస్ లివింగ్‌లోని 2,000 చదరపు అడుగుల విల్లాను కొనుగోలు చేశారు. ఇది ఆవాస్ విలేజ్‌లోని ఆదిత్య కిలాచంద్‌కు చెందిన లగ్జరీ బంగ్లా. దీని పక్కనే అమితాబ్ బచ్చన్ స్థలం ఉంటుందని టాక్.

రోహిత్ శర్మకు కూడా

2022 సెప్టెంబర్‌లో విరాట్-అనుష్క జంట జిరాద్ గ్రామంలో 3,350 చదరపు మీటర్ల (36,059 చదరపు అడుగులు) ఫాంహౌస్‌ను రూ . 19.24 కోట్లకు కొనుగోలు చేశారు. 2021లో రోహిత్ శర్మ కూడా ఇదే ప్రాంతంలోని మత్రోలి గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

షోలే సక్సెస్ తర్వాత

ఇదిలా ఉంటే, 2023లో అమితాబ్ బచ్చన్, అతని భార్య జయా బచ్చన్ జుహులోని ఐదు నివాసాల్లో మొదటిదైన ప్రతిక్షా బంగ్లాను వారి 49 ఏళ్ల కుమార్తె శ్వేతా నందకు బహుమతిగా ఇచ్చారు. 1975లో విడుదలైన బ్లాక్ బస్టర్ షోలే విజయం తరువాత ఈ జంట జుహులో కొనుగోలు చేసిన మొదటి బంగ్లా ప్రతిక్ష.

బ్యాంక్‌లకు లీజ్

జుహులో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఉన్న ఇతర ఆస్తుల్లో జనక్ బంగ్లా ఒకటి. దీనిని ఎక్కువగా కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. వీటితోపాటు అమితాబ్‌కు వత్స, అమ్ము అనే మరో రెండు బంగ్లాలు ఉన్నాయి. వీటిలో కొంత భాగాన్ని సిటీ బ్యాంక్‌కు లీజుకు ఇచ్చారు. 2021లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లీజుకు ఇచ్చారు.

అశ్వత్థామ పాత్ర గ్లింప్స్

కాగా 81 ఏళ్ల అమితాబ్ బచ్చన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.