Vijay Deverakonda Prashanth Neel: పాన్ ఇండియా లెవల్లో మరో క్రేజీ కాంబినేషన్ రెడీ అవుతోందా? కేజీఎఫ్, సలార్ లాంటి మూవీస్ అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడా? ఈ మధ్యే హైదరాబాద్ లో విజయ్ ఇంటికి వెళ్లి మరీ ప్రశాంత్ అతన్ని కలవడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అయితే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

విజయ్, ప్రశాంత్ మూవీ?

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి ప్రశాంత్ నీల్ అతన్ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య మూవీ రాబోతుందన్న పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతూ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న విజయ్కు ఓ పెద్ద హిట్ చాలా అవసరం. అందుకే ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో అతడు సినిమా చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే అలాంటిదేమీ లేదని, విజయ్ ఇంటికి డిన్నర్ చేయడానికే ప్రశాంత్ వెళ్లినట్లు అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విజయ్ తో పూర్తిస్థాయి సినిమా కాదు కానీ.. సలార్ 2 లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తో తాను చేయబోయే మూవీలో ఓ క్యారెక్టర్ ను విజయ్ కు అతడు ఆఫర్ చేసినట్లు కూడా చెబుతున్నారు. ఇద్దరూ ఓ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారనీ మరికొందరు అంటున్నారు.

మొత్తానికి వీళ్ల డిన్నర్ మీట్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితేగానీ ఈ వార్తలు ఆగేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ అయితే చాలా బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తో సలార్ 2తోపాటు జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ, తర్వాత కేజీఎఫ్ 3లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రశాంత్ నీల్ చేతుల్లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో సినిమా అంటే అంత నమ్మశక్యంగా లేదు. ఈ మూడు ప్రాజెక్టుల తర్వాత అంటే దానికి చాలా సమయం పడుతుంది. ఈ మూడూ అంత తొందరగా పూర్తయ్యే సినిమాలు కావు. దీంతో విజయ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఇప్పట్లో సాధ్యం కాదన్నది స్పష్టమవుతోంది.

విజయ్ దేవరకొండ.. హిట్ కోసం ఎదురు చూపులు

విజయ్ దేవరకొండకు మాత్రం ఇప్పుడు పెద్ద బ్రేక్ కచ్చితంగా అవసరం. లేదంటే అతని కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ లతో హ్యాట్రిక్ ఫ్లాపులు విజయ్ ని వేధిస్తున్నాయి. ముఖ్యంగా రెండేళ్ల కిందట వచ్చిన లైగర్ భారీ నష్టాలను మిగిల్చింది. తాజాగా రిలీజైన ఫ్యామిలీ స్టార్ కూడా బాక్సాఫీస్ దగ్గర కనీసం రూ.15 కోట్లు కూడా వసూలు చేయలేదు.

దీంతో నిర్మాత దిల్ రాజు కూడా నష్టాల పాలయ్యాడు. తనకు గీత గోవిందం లాంటి హిట్ ఇచ్చిన పరశురాం కూడా విజయ్ లక్కు మార్చలేకపోయాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తో సినిమా నిజమైతే బాగుండు అని అతని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు. అలాంటి హిట్టు పడితేగానీ వీడీ మళ్లీ గాడిలో పడే అవకాశాలు కనిపించడం లేదు.