Malaysia navy helicopters crash: మలేషియాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు మంగళవారం ట్రైనింగ్ సెషన్ లో ఢీకొని కూలిపోవడంతో అందులోని 10 మంది సిబ్బంది మృతి చెందారు. మే నెలలో జరిగే నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల కోసం మంగళవారం ఉదయం నేవీ హెలీకాప్టర్లు రిహార్సల్స్ చేస్తుండగా రెండు హెలికాప్టర్లు ఢీ కొని కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 10 మంది చనిపోయారు. మలేసియాలో మే నెలలో నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకలు జరుగుతాయి. ఆ వేడుకల్లో విన్యాసాలు చేయడం కోసం నేవీ హెలీకాప్టర్లు (navy helicopters) లుముత్ నావికా స్టేడియంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అయ్యాయి.

ప్రమాదం ఎలా జరిగింది?

నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల్లో భాగంగా నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ విన్యాసాలు చేస్తాయి. ఆ విన్యాసాలకు సంబంధించి మంగళవారం ఉదయం నేవీ హెలీకాప్టర్లు రిహార్సల్స్ చేస్తున్నాయి. ఆ సమయంలో ఒక హెలికాప్టర్ మరో హెలికాప్టర్ వెనుక రోటర్ ను క్లిప్పింగ్ చేయడంతో రెండూ టెయిల్ స్పిన్ లోకి వెళ్లి కూలిపోయాయి. ఫెన్నెక్ AS555SN యూరోకాప్టర్, అగస్టా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ139 హెలికాప్టర్లు ఈ ప్రమాదానికి గురైనట్లు మలేసియా రెస్క్యూ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదం అనంతరం నౌకాదళ బేస్ స్టేడియం ట్రాక్ పై యూరోకాప్టర్, స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుప్పకూలాయని వివరించింది.

ప్రధాని సంతాపం

ఈ ప్రమాదంలో చనిపోయిన నౌకాదళ సిబ్బంది కుటుంబాలకు మలేసియా (Malaysia) ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) సంతాపం తెలిపారు. హృదయ విదారకమైన, ఆత్మను కదిలించే ఈ దుర్ఘటనపై దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందన్నారు. ప్రమాదానికి గల కారణాలను కనుగొనడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, ముఖ్యంగా టీఎల్ డీఎం (రాయల్ మలేషియా నేవీ) లోతైన దర్యాప్తు ప్రారంభించినట్లు తనకు సమాచారం అందిందని ఆయన చెప్పారు.

గతంలో కూడా..

ఆగ్నేయాసియా దేశమైన మలేసియా (Malaysia)లో హెలికాప్టర్లకు సంబంధించిన ప్రమాద సంఘటనలు గతంలో కూడా జరిగాయి. గత నెలలో మలక్కా జలసంధిలో మలేసియా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయింది. కానీ, అదృష్టవశాత్తూ ఆ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2016లో మలేషియాలోని సరావాక్ రాష్ట్రంలో యూరోకాప్టర్ ఏఎస్ 350 కూలిన ఘటనలో ఓ డిప్యూటీ మినిస్టర్ మరణించారు.