Karthika deepam 2 serial april 23rd episode: సుమిత్ర దీప వివరాలు తెలుసుకోవాలని మెల్లగా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. నీకు వంటలు ఎవరు నేర్పించారని అడుగుతుంది. మా నాన్న నేర్పించారు ఆయన పెద్ద వంట మాస్టర్ అని చెప్తుంది.

నువ్వు నా కూతురివి 

వండి వడ్డించడం మీ రక్తంలోనే ఉందన్న మాట అని సుమిత్ర అంటుంది. మీకు కూడా ఉంది కదా అప్పుడు గుడిలో మీరు నాకు వడ్డించారు. పైగా మీకు రెస్టారెంట్ బిజినెస్ ఉందని పోలీసామె చెప్పారు. నేను వంద మందికి పెడితే మీరు వేల మందికి పెడుతున్నారని దీప అంటుంది.

అవును దీప నువ్వు అంటుంటే అనిపిస్తుంది. మన ఆలోచనల్లోనే కాదు మన ఇద్దరి రక్తాల్లో ఒకే ఆలోచన ఉందని సుమిత్ర ఎమోషనల్ గా అంటుంది. నీకు నాకు ఏదో బంధం ఉంది దీప చూస్తుంటే చాలా దగ్గరగా అనిపిస్తుంది. పోయిన జన్మలో నువ్వు నా కూతురిగా పుట్టి ఉంటావ్ లేదంటే మా అమ్మవి అయి ఉంటావని సుమిత్ర ఎమోషనల్ గా చెప్తుంది.

మీ ఆయన ఎక్కడ 

మీలో నేను అమ్మని చూసుకుంటున్నానని దీప అంటుంది. శౌర్య వాళ్ళ నాన్న ఏం చేస్తుంటారని సుమిత్ర అడగ్గానే దీప ఏదో ఆలోచనలో ఉండి డ్రైవర్ అని చెప్పేస్తుంది. మీ ఆయన ఎక్కడ ఉంటాడని సుమిత్ర గట్టిగా అడిగేస్తుంది. దీప మాత్రం ఆ టాపిక్ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతుంది.

నీ భర్త గురించి చెప్తేనే కదా నేను సాయం చేయగలిగేది. ఇంతకీ వాడు ఎక్కడ ఉంటాడని సుమిత్ర అనుకుంటుంది. కార్తీక్ పారిజాతాన్ని నిలబెట్టి కడిగేస్తాడు. పారు మీరంతా అనుకున్నట్టు జ్యోత్స్న నా జీవితంలోకి రాదు. నేను తనని పెళ్లి చేసుకోను.

నువ్వు చెప్పడం లేదని నేనే మా అమ్మతో చెప్పాలనుకున్నాను కానీ వాళ్ళ మాటలు విని ఆగిపోయానని చెప్తాడు. అయితే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది. ఇష్టం లేని అమ్మాయితో నడవడం కష్టం అలాంటిది జీవితాంతం కలిసి నడవడం అంటే దాన్ని నరకం అంటారని చెప్తాడు.

జ్యోత్స్నని పెళ్లి చేసుకోను 

జ్యోత్స్న నీకు ఎందుకు నచ్చలేదని పారు అడుగుతుంది. నాకు అత్త, మావయ్య, తాతయ్య ఎలాగో జ్యోత్స్న కూడా అలాగే. చేతులు పట్టుకుని తిరగడానికి చెయ్యి పట్టుకుని తిరగడానికి చాలా తేడా ఉంది. మేం కలిసి పెరిగాము కానీ భార్యాభర్తలు కాలేము.

మీరందరూ కలిసి చిన్నప్పటి నుంచి దాని మైండ్ చెడగొట్టారు. ఇష్టం లేని పని చిన్నపిల్లలే చేయరు అలాంటిది నేను ఎలా చేస్తాను. నువ్వు పెళ్లి ముహూర్తాలు ఆపి అసలు విషయం అందరితో చెప్పకపోతే నేనే అందరితో చెప్తాను. చెప్పకపోతే ఎదురుపడటానికి నేను బాధపడాలి. నువ్వు ఇప్పుడు చెప్తావా నేనే వెళ్ళి చెప్పమంటావా అంటాడు.

మాట మార్చిన పారు 

ఇప్పుడు కాదు ఒక నాలుగు రోజుల తర్వాత నేనే చెప్తానని కార్తీక్ ని ఆపుతుంది. ఇది కూడా నా కుటుంబమే. నా కారణంగా ఎవరు బాధపడకూడదని అంటాడు. మీ ఇద్దరికీ పెళ్లి కాకుండా చేసే బాధ్యత నాదని మాట ఇస్తుంది. కార్తీక్ కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతాడు.

నా మాటలు నీటి మీద రాతలు లాంటివి. మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అన్నానా కానీ మీ ఇద్దరి పెళ్లి అయ్యేలా చేసే బాధ్యత నాది అని అనుకుంటుంది. దీప చేసిన పాయసం తిని సుమిత్ర వాళ్ళు తెగ పొగిడేస్తారు. కార్తీక్ ని పిలిచి సుమిత్ర పాయసం పెడుతుంది.

కార్తీక్ పాయసం తిని చాలా స్పెషల్ గా ఉందని మెచ్చుకుంటాడు. ఎవరు చేశారని అడిగితే దీప చేసిందని సుమిత్ర చెప్తుంది. పాయసమే కాదు వంటలు కూడా చాలా బాగా చేసింది. నీకోక అడ్వైజ్ నీ కొత్త రెస్టారెంట్ కి చెఫ్ గా దీపను తీసుకోమని దశరథ సలహా ఇస్తాడు.

చెఫ్ గా దీప 

దీప వంట మాస్టర్ అయితే జనాలు నీ రెస్టారెంట్ దగ్గర క్యూ కడతారని సుమిత్ర చెప్తుంది. దీపని నేను ఒప్పిస్తానని అంటుంది. కానీ దీప మాత్రం వద్దమ్మా నా పనులు నాకు ఉన్నాయి నేను వెళ్ళాలి అంటుంది. రెస్టారెంట్ లో చెఫ్ అంటే మంచి జీతం వస్తుంది. నీకు ఇదొక మంచి అవకాశం. నీ జీవితం మారిపోతుందని సుమిత్ర అంటుంది.

ఏదైనా తేడా పడితే మన జీవితాలు మారిపోతాయి. నలుగురికి వంట చేసిపెట్టడం వేరు నాలుగు వందల మందికి రుచిగా చేయగలుగుతుందని అనుకుంటున్నారా? లేదంటే వంట పేరుతో పర్మినెంట్ గా ఇంట్లో పెట్టుకుందామని అనుకుంటున్నారా అంటుంది.

పెట్టుకుంటే తప్పు ఏంటి? వంట చేసేది దీప, రెస్టారెంట్ కార్తీక్ ది వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు మధ్యలో నీకు ఏంటని శివనారాయణ కౌంటర్ వేస్తాడు. ఏదైనా జరిగితే రెస్టారెంట్ మూసుకోవాల్సి వస్తుందని పారు అంటుంది. దీప వంటలు చేస్తే ఆ పరిస్థితి రాదని శివనారాయణ వెనుకేసుకొస్తాడు.

వెళ్లిపోతానన్న దీప 

దీప మాత్రం మీరు అడిగిన దానికి నేను ఒప్పుకోలేను నాకు వేరే జీవితం ఉంది వెళ్లిపోవాలని చెప్పేస్తుంది. దీపకు ఏదో ఒక రూపంలో సాయం చేయాలని అనుకుంటున్నాను కానీ తను వెళ్లిపోతానని అంటుంది. దీపను ఎలా ఆపాలని సుమిత్ర ఆలోచిస్తుంది.

శౌర్య పరిగెత్తుకుంటూ భయపడుతూ ఇంట్లోకి వచ్చి దీపని కౌగలించుకుంటుంది. ఏమైందని అంటే బూచోడు వచ్చాడు. ఆరోజు నేను పూలు కొస్తే నీతో గొడవ పడ్డాడు కదా ఆ బూచోడు వచ్చాడని చెప్పేసరికి దీప షాక్ అవుతుంది. నీతో ఏమైనా మాట్లాడాడా అని దీప అడిగితే లేదు నన్ను పిలిచాడు నేను పరిగెత్తుకుంటూ వచ్చానని అంటుంది.

దీప దగ్గరకు నరసింహ 

దీప కోపంగా నరసింహ దగ్గరకు వస్తుంది. ఎందుకు వచ్చవని అడుగుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావని నరసింహ అంటాడు. నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటని అంటాడు. సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అడిగే హక్కు నీకు లేదని అంటుంది. ముందు నువ్వు బయటకు నడువు అంటుంది.

నువ్వు గుడి దగ్గర ఒకడితో నన్ను కొట్టిచ్చావు చూడు ఇది వాడి ఇల్లు. నా కూతురికి వాడు ఏదో తండ్రి అయినట్టు షాపింగ్ చేయడాలు, ఐస్ క్రీమ్ తినిపించి మూతి తుడవడాలు కథ చాలా దూరం పోయింది. నా కూతురిని కూతురుగా చూసుకుంటున్నట్టు నా పెళ్ళాన్ని కూడా పెళ్ళాంగా చూసుకుంటున్నాడా అంటాడు.

చెప్పు తీసి పళ్ళు రాలగొట్టక ముందే ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని తిడుతుంది. దీప గురించి నీచంగా మాట్లాడతాడు. నీలాంటి కుక్క దగ్గర నేను ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అంటుంది. అవును నేను పిచ్చి కుక్కనే నిన్ను కరవడానికి వచ్చాను. నువ్వు ఇక్కడ ఉంటే నా శోభ నాతో ఉండనని అంటుంది. నువ్వు ఇక్కడ ఉండకూడదు వెంటనే ఊరు వెళ్లిపో అంటాడు.

నరసింహ చెంప పగలగొట్టిన సుమిత్ర 

మన కూతురిని తీసుకురా మిమ్మల్ని బస్సు ఎక్కిస్తానని అంటాడు. దీప కోపంగా చూస్తుంది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు పద అంటాడు. నువ్వు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు పో అంటుంది. నువ్వు ఇక్కడ ఉంటే నాకు నష్టం నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తానని తన చేతిని పట్టుకుని లాక్కెళ్లబోతాడు.

సుమిత్ర లాగిపెట్టి నరసింహ చెంప చెల్లుమనిపిస్తుంది. చంపుతానని బెదిరిస్తున్నావ్ అసలు ఎవడ్రా నువ్వు అని సుమిత్ర కోపంగా అడుగుతుంది. నేనే నీ మెడలో తాళి కట్టిన మొగుడిని అని చెప్పు అని నరసింహ అనేసరికి సుమిత్ర దీపని ఇది నిజమేనా అని అడుగుతుంది. దీప మౌనంగా తలదించుకుంటుంది.

దీప నా కూతురు 

నువ్వు కాదని ఒక్క మాట చెప్పు వీడిని ఏం చేయాలో తెలుసు. వీడు చెప్పేది నిజం కాదు కదా అంటుంది. అవునని దీప తలాడిస్తుంది. ఇక దీప మీ ఇంట్లో ఉండదు తీసుకుని వెళ్లిపోడానికి వచ్చానని దీప చెయ్యి పట్టుకోబోతే నరసింహని ఆపుతుంది. దీపని ముట్టుకుంటే ఊరుకొనని అంటుంది.

దీపని చూస్తుంటేనే అర్థం అవుతుంది నువ్వు ఎంత మంచి మొగుడివో. దీప నీతో రాదని అంటుంది. అని చెప్పడానికి నువ్వు ఎవరివి అంటాడు. నేను దీప తల్లిని అని చెప్తుంది. దీప సుమిత్ర వైపు ప్రేమగా చూస్తుంది.