Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో (Sangareddy)దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కలిసి ఓ దుకాణంలో కాపర్ వైరును చోరీ చేసి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును పంచుకునే క్రమంలో గొడవ జరిగింది. ఆ గొడవలో ఓ యువకుడు బాలుడ్ని హత్య(Killed Boy) చేశాడు. ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. కాపాడే ప్రయత్నం చేసిన వారిపై కత్తితో దాడి చేసి చివరకు అదే సెల్ టవర్ పై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట(Jogipet)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వడ్డే నాగరాజు (25) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో నాగరాజు జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కాగా గత కొన్ని రోజుల నుంచి ఒక పాత ఇనుప సామాగ్రి దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మరో దుకాణంలో పనిచేస్తున్న శేఖర్ (13)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి శేఖర్ పనిచేస్తున్న దుకాణంలో శనివారం కాపర్ వైర్ ను చోరీ చేసి నాగరాజు పనిచేస్తున్న దుకాణంలో అమ్మారు. ఆ వచ్చిన డబ్బును పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అతడిపై కోపం పెంచుకున్న నాగరాజు మాయమాటలు చెప్పి చెరువు వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ గొంతు నులిపి హత్య చేసి అనంతరం సమీపంలో ఉన్న బావిలో పడేశాడు.

సెల్ టవర్ కేబుల్ మెడకు చుట్టుకుని

అదేవిధంగా ఓ చిరువ్యాపారిని డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో అతడిని ఇనుపరాడ్డుతో తలపై కొట్టాడు నాగరాజు. ఈ దాడిలో చిరువ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా ఆదివారం ఉదయం బావిలో శేఖర్ మృతదేహం లభ్యమైంది. ఈ రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. గమనించి అతడు దగ్గర్లోని సెల్ టవర్(Climbed Cell Tower) ఎక్కాడు. అతడిని కిందికి దించేందుకు వెళ్లిన వారిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు కిందికి దిగామని చెప్పిన వినలేదు. శనివారం రాత్రంతా టవర్ పైనే ఉన్న అతను ఆదివారం మధ్యాహ్నం వరకు ప్రాణాలతోనే ఉన్నాడు. దీంతో కిందికి దిగితే తనకు శిక్ష తప్పదని భావించి సెల్ టవర్ కేబుల్ ను మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఇద్దరు వ్యక్తులను టవర్ పైకి పంపించి మృతదేహాన్ని కిందికి దింపి జోగిపేట(Jogipet) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు శేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.