ఈ మధ్య కాలంలో గింజలు తినడం అనే ట్రెండ్ ఎక్కువగా ఉంది. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్నో పోషక విలువలు ఉన్న అవకాడో పండు గింజలు తినవచ్చా అని చాలా మందికి సందేహం ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

అవకాడోలో 20 కంటే ఎక్కువ విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇతర పండ్ల కంటే ఇది ఎక్కువే. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి డైటర్స్ తీసుకుంటారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినాల్సిన పండ్లలో ఈ పండు చాలా ముఖ్యమైనది. రుచితోపాటుగా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే దీని గింజలపై మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి.

దీని గింజలు ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన పండు అని ఇటీవలి కాలంలో ప్రచారం చేస్తూ అనేక వీడియోలు, రీల్స్ వచ్చాయి. అవకాడో విత్తనాలను వృథా చేయకండి అని చెబుతున్నారు. ఈ గింజలను తింటే ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవకాడో పండు గుజ్జు కంటే తక్కువ పోషకాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అవకాడో గింజలు

అవకాడో గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి రెండు రకాల యాంటీఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, ప్రోసైనిడిన్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కలిసి అవకాడోస్ మొత్తం యాంటీఆక్సిడెంట్ లక్షణాలలో 38 శాతం వరకు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయి. అవకాడో సీడ్ పౌడర్ మొత్తం కొలెస్ట్రాల్, చెడు (LDL) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని చెబుతారు.

అవకాడో గింజల ఉపయోగాలు

డయాబెటిస్ ట్రయల్స్‌లో అవోకాడో సీడ్ సారం డయాబెటిస్ మందుల వలె ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. అలాగే దాని విత్తన సారం రక్తనాళాలను సడలించి, రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ గింజల్లో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను ఉన్నాయి.

టాక్సిన్స్ కూడా ఉంటాయి

అవకాడో గింజల్లో కూడా నిర్దిష్ట మోతాదులో టాక్సిన్స్ ఉంటాయి. వీటిలో పెర్సిన్ అనే ఫంగైసైడ్ టాక్సిన్ ఉంటుంది. అతిగా తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఓ డేటా ప్రకారం దీని విత్తనాలు యాంటీన్యూట్రియెంట్లను కూడా కలిగి ఉంటాయి. టానిన్లు, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ వంటి ఈ పదార్థాలు ఖనిజాలు, విటమిన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

ఇలా వాడుకోవచ్చు

అవకాడో గింజలను కోసి ఎండబెట్టి తినమని చెబుతూ ఇటీవల చాలా వీడియోలు వచ్చాయి. కానీ ఇలా చేయడం వల్ల గింజల ప్రతికూల ప్రభావాలను తొలగించలేం. ఈ విత్తనాలను తినడానికి సురక్షితమైన మార్గం లేదు. అయితే మీరు విత్తనాలను వృథా చేయకుండా ఉండాలనుకుంటే వాటి నుండి నూనెను తీయవచ్చు. లేదా ఎండబెట్టి తక్కువ మెుత్తం వంటలో వాడుకోవచ్చు. అవకాడో గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.

అవోకాడో గుజ్జును తినండి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవకాడో గుజ్జు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లతో నిండి ఉంటుంది. మిగిలిపోయిన విత్తనాలతో అవోకాడో చెట్టును పెంచడం ఉత్తమం. అవకాడో గింజలపై క్లారిటీ లేనప్పుడు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.