Kondagattu Hanuman Jayanti : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు సోమవారం వేకువజామున ప్రత్యేక పూజలతో అర్చకులు అంకురార్పణ చేశారు. మంగళవారం హనుమాన్ జయంతి కాగా ఒకరోజు ముందే భక్తులు పెద్దసంఖ్యలో కొండగట్టుకు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గడ్ నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు.

కాషాయ వర్ణంగా మారిన కొండగట్టు

హనుమాన్ దీక్ష స్వాములు భారీగా కొండగట్టుకు తరలి రావడంతో కొండంత కాషాయ వర్ణంగా మారింది. జై హనుమాన్…రామనామ స్మరణతో మారుమ్రోగుతుంది. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా హనుమాన్ దీక్ష (Hanuman Deekshan)స్వాములు భక్తితో కాలినడకన కొందరు, వాహనాల్లో మరికొందరు కొండగట్టు(Kondagattu)కు చేరుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సోమవారం మధ్యాహ్నం వరకే 15 వేల మంది హనుమాన్ దీక్ష స్వాములు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కొందరు దీక్ష మాల విరమణ చేయగా, మరికొందరు పెద్ద హనుమాన్ జయంతి (Kondagattu hanuman Jayanti)వరకు మాలధారణతో దీక్ష తీసుకున్నారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు లక్షకుపైగా మంది భక్తులు వస్తారని ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఎండ వేడి నుంచి తట్టుకునేలా చలవ పందిళ్లతో పాటు దారిలో పలుచోట్ల చలివేంద్రాలు మంచినీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. భక్తుల రద్దీతో మూడు రోజులపాటు ఆర్జిత సేవలన్నీ రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

కొండగట్టులో రెండు సార్లు హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతికి(Hanuman jayati) కొండగట్టుకు ప్రత్యేకత ఉంది. విశ్వవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఒక్కసారి జరుపుతుండగా కొండగట్టు(Kondagatti)లో రెండు సార్లు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. చైత్రమాసం ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి, వైశాఖ మాసం బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. ఏటా రెండుసార్లు జరిగే హనుమాన్ జయంతి వేడుకలకు దీక్ష స్వాములు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

HT తెలుగు Correspondent K.V.REDDY, Karimnagar