OTT Stand up comedy shows: ఓటీటీలు వచ్చిన తర్వాత స్టాండప్ కామెడీ షోలు చేసే వారికి కూడా డిమాండ్ పెరిగింది. అంతకుముందు యూట్యూబ్ లో చిన్నచిన్న షోలు చేసుకునే వాళ్లు కూడా ఓటీటీలు వచ్చిన తర్వాత పెద్ద స్టార్లుగా ఎదిగిపోయారు. జాకిర్ ఖాన్ లాంటి స్టాండప్ కమెడియనే దీనికి నిదర్శనం. మరి మీకు కూడా ఈ స్టాంపడ్ కామెడీ నచ్చితే ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో ఉన్న బెస్ట్ షోలు ఏవో ఇక్కడ చూడండి.

ఓటీటీల్లోని బెస్ట్ స్టాండప్ కామెడీ షోలు

రెగ్యులర్ సినిమాలు, వెబ్ సిరీస్ చూసి చూసి బోర్ కొడితే ఇలా స్టాండప్ కామెడీ షోలతో ఓ కొత్త అనుభూతి మీ సొంతమవుతుంది. ఇన్నాళ్లూ పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న ఈవెంట్లుగా సాగిన స్టాండప్ కామెడీ.. ఓటీటీల ద్వారా లక్షల మంది ప్రేక్షకులకు చేరువైంది.

జాకిర్ ఖాన్: మన్ పసంద్ – ప్రైమ్ వీడియో

ప్రముఖ స్టాండప్ కమెడియన్ జాకిర్ ఖాన్ చేసిన షో మన్ పసంద్ (Mannpasand). అతడు చేసిన ఎన్నో స్టాండప్ కామెడీ షోలలాగే ఇది కూడా ఎంతగానో నవ్విస్తుంది. ఈ షోలో జాకిర్ చెప్పే జోక్స్ తో మనల్ని మనం రిలేట్ చేసుకోవచ్చు. ఓ వీకెండ్ హాయిగా నవ్వుకోవాలి అంటే ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ మన్ పసంద్ షో చూసేయండి.

కామిక్‌స్థాన్ సీజన్ 3 – ప్రైమ్ వీడియో

కామిక్‌స్థాన్ అనేది పలువురు స్టాండప్ కమెడియన్లు కలిసి చేసే షో. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ మధ్యే వచ్చిన మూడో సీజన్లో 8 మంది స్టాండప్ కమెడియన్లను తమ జోకులతో ప్రేక్షకులను నవ్వించారు. 2018 నుంచి ఈ కామిక్‌స్థాన్ స్టాండప్ కామెడీ షో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

హక్ సే సింగిల్ – ప్రైమ్ వీడియో

రిలేషన్షిప్ లో ఉండటం కంటే సింగిల్ గా ఉండటమే బెటర్ అనుకునే వారు అందరూ చూడాల్సిన స్టాండప్ కామెడీ షో హక్ సే సింగిల్. తాను ప్రేమలో పడటం, అమ్మాయి రిజెక్ట్ చేయడం, గుండె పగలడం.. ఇలా జాకిర్ ఖాన్ తన లవ్ స్టోరీని కడుపుబ్బా నవ్వించేలా చెప్పిన షో ఇది. గంటన్నర పాటు ఉన్న ఈ షో ప్రైమ్ వీడియోలో ఉంది.

కక్షా గ్యార్వీ – ప్రైమ్ వీడియో

జాకిర్ ఖాన్ తీసుకొచ్చిన మరో స్టాండప్ కామెడీ షో కక్షా గ్యార్వీ. మనల్ని కూడా స్కూలింగ్ తర్వాతి ఇంటర్మీడియట్ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే షో ఇది. బాయ్స్ స్కూల్లో చదివిన తన అనుభవాన్ని జాకిర్ ఖాన్ ఫన్నీగా వివరించాడు. ఈ షోని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ఇక ఇదే ప్రైమ్ వీడియోలో బిశ్వ మస్త్ ఆద్మీ, డోన్ట్ బి దట్ గయ్, ది ఇంప్రొవైజర్స్, వన్ మైక్ స్టాండ్ లాంటి షోలు కూడా చూడొచ్చు.

లేడీస్ అప్ – నెట్‌ఫ్లిక్స్

అందరూ ఫిమేల్ స్టాండప్ కమెడియన్లతో కూడిన షో ఈ లేడీస్ అప్. నెట్‌ఫ్లిక్స్ లో ఈ షో చూడొచ్చు. కనీజ్ సుర్కా, సుప్రియా జోషి, ప్రశాంతి సింగ్ లాంటి స్టాండప్ కమెడియన్లు ఈ షో ద్వారా నవ్వించే ప్రయత్నం చేశారు.

వీర్ దాస్ ఫర్ ఇండియా – నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ మాటల్లో మన భారతదేశ చరిత్రను సరదాగా తెలుసుకోవానుకుంటే ఈ షో చూడండి. బాలీవుడ్ తోపాటు రాజకీయాలపై పంచ్ డైలాగులతో ఈ షో సరదాగా సాగిపోతుంది.