posted on Apr 22, 2024 2:37PM

పశ్చిమ బెంగాల్‌  రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కోల్ కతా హైకోర్టు   సోమవారం (ఏప్రిల్ 22) సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష నియామక ప్రక్రియ చెల్లదని పేర్కొంటూ ఆ పరీక్ష, ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా ఆ టెస్ట్ లో పాసై ఉద్యోగాలలో చేరిన ఉపాధ్యాయులంతా తమ తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.  

ప్రభుత్వ , ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది.  24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం  ఎంపిక ప్రక్రియ చేపట్టి  25,753 మందిని ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు.

అయితే ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి, ఆరోపణలు వచ్చాయి.  న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం, 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిర్ధారించి  తీర్పు వెలువరించింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌కు సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

 2016 ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నాలుగు వారాల్లోగా తాము అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో  పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మాజీ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీ ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.