posted on Apr 19, 2024 12:14PM

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  ప్రకాష్ గౌడ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఆయన కేవలం మర్యాదపూర్వకంగా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డిని కలవలేదు. తాను తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుతామని చెప్పడానికే రేవంత్ రెడ్డిని కలిశారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. ఇలా ఉండగా గత కొంత కాలంగా ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత లోక్ సభ ఎన్నికల తరువాత రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయనీ, కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉందనీ, ఇప్పటికే 20 మంది వరకూ తమతో టచ్ లో ఉన్నారనీ చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లడం విశేషం. వసలను నిరోధించడానికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారని ప్రకాష్ గౌడ్ ఉదంతంతో తేటతెల్లమైంది.

కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతిక మంది  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారనీ, వీరంతా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ చెప్పిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద సిట్టింగులను కాపాడుకోవడంలో, వలసలను నివారించడంలో బీఆర్ఎస్ అధినాయకత్వొం చేతులెత్తేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.