posted on Apr 18, 2024 1:32PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు. జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ నిస్సందేహంగా ఎన్నో ఇబ్బందులకు గురైంది. సినిమా టికెట్ల ధరల విషయంలో కానీ, సినిమా విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలకు అనుమతుల విషయంలో కానీ జగన్ సర్కార్ ఇండస్ట్రీని ఇబ్బందులకు గురి చేసింది. జగన్ కు మొదటి నుంచీ కూడా సినీ పరిశ్రమలోని పలువురు పెద్దలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న భావన ఉంది. తాను సీఎం అయిన సందర్భంలో సినీ పరిశ్రమ పెద్దలు ఎవరూ తనను అభినందించలేదన్న కోపం కూడా మనసులో పెట్టుకున్నారని సినీ వర్గాల సమాచారం. ఆ కారణంగానే పరిశ్రమ పెద్దలను తన గెప్పెట్లో ఉంచుకోవాన్న ఉద్దేశంతోనే సినిమా టికెట్ల ధరల నియంత్రణ పేరుతో రాష్ట్రంలో పెద్ద సినిమాలు  ఒకటి రెండు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టుకునే విధానానికి ఆయన కళ్లెం వేసినట్లు కనిపిస్తున్నారు. అలాగే కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు కూడా కళ్లెం వేయడంతో పరిశ్రమ పెద్దలు ఆయన వద్దకు వెళ్లి మరీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి నెయ్యం కోరుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరినా ఫలితం లేకపోయిన సంగతి తెలిసిందే.  అయితే జగన్ సర్కార్ విషయంలో సినీ పరిశ్రమలోని పెద్దలు ఆర్థిక నష్టాల భయంతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల విషయంలో ఒకరిద్దరు వినా మొత్తం పరిశ్రమ సైలెంటైపోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

 ఈ నేపథ్యంలో జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న కొందరు నటులు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.    

జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనకాపల్లి రూరల్ మండలంలోని బీఆర్టీ కాలనీలో వీరు ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. వీరి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.