ప్రత్యేక టెట్ కోసం సర్వీస్ టీచర్లు డిమాండ్

టెట్ పరీక్షపై సర్వీస్‌ టీచర్ల(Teachers) నుంచి మరో డిమాండ్ వినిపిస్తుంది. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్‌(TS TET) నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. డీఎస్సీకి(TS DSC 2024) ముందే టెట్‌ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నా… వీరితో పోటీ పడి టెట్‌ రాయాలన్న నిబంధనను సర్వీస్‌ టీచర్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఎడ్ , డీఎడ్ అభ్యర్థులతో పోటీ పడి టెట్ రాయాలనడంపై ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. సర్వీస్‌ టీచర్ల టెట్‌ కు అవసరమైన మార్గదర్శకాలను ఇంకా ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. టీచర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ ఈ ప్రక్రియపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ టెట్‌ సిలబస్‌ను మాత్రమే విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ టెట్‌ దరఖాస్తులను మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు స్వీకరించనున్నారు. మే 20 నుంచి జూన్‌ 3 వరకూ టెట్‌ ను నిర్వహించనున్నారు.