సాగుకు నీళ్లు ఆపి…తాగడానికి ఇవ్వండి

ఎల్ఎండీలో వాటర్ డెడ్ స్టోరేజ్(Water Dead Storage) కు చేరిందనే సమాచారంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు డ్యామ్ ను సందర్శించారు. అడుగంటిన నీటి మట్టాన్ని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ మార్చి మాసంలో నీటి నిల్వలు పడిపోవడం చూడలేదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ ప్రభుత్వ హాయంలో తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే దిగువకు సాగునీరు అందించాలనే జీవో ఇచ్చారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha) కోసం LMD లో 13 టీఎంసీలు, మిడ్ మానేర్ డ్యామ్(MMD) లో 6.5 టిఎంసీల నీటి నిల్వలు తగ్గకుండా చూశారని తెలిపారు. కాళేశ్వరం జలాలతో ఎల్ఎండీ, ఎంఎండీ రిజర్వాయర్లను నింపడంతో మండు వేసవిలో రెండు డ్యామ్ లు నిండు కుండలా కనిపించడంతో కరీంనగర్ (Karimnagar Water Supply)లో ప్రతి రోజు 24/7 గంటలు నీటి సప్లై చేశామని తెలిపారు. బూస్టర్ల ద్వారా నీరు అందించడం సాధ్యంకాదని అధికారులు చెప్పడంతో సీఎం స్పందించి ఎల్ఎండీ నుంచి దిగువకు సాగు నీటి విడుదల నిలిపి వేయించాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండీలో ప్రస్తుతం ఉన్న 5 టీఎంసీలకు మరో రెండు టీఎంసిల నీళ్లను మిడ్ మానేర్ నుంచి విడుదల చేస్తే నగర ప్రజలకు రోజుకు గంట నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.