- సంతోష్ గౌడ్‌కు కాంగ్రెస్ యువ నాయకుడు హరీష్ గౌడ్
- మున్సిపల్ స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టలేదా?
- అధికారం కోసం రంగులు మార్చే చరిత్ర మీది కాదా..!
జనవాహిని ప్రతినిధి తాండూరు: మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి పై బిఆర్ఎస్ నాయకుడు సంతోష్ గౌడ్ చేసిన విమర్శలను కాంగ్రెస్ యువ నాయకుడు హరీష్ గౌడ్ ఖండించారు. బాల్ రెడ్డి పై విమర్శలు చేసే స్థాయి సంతోష్ గౌడ్ కు లేదన్నారు. ఈ సందర్బంగా హరీష్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ…. నిబద్ధత గల నాయకుడు బాలరెడ్డి ని మతిస్థితి లేదని మాట్లాడం హాస్యాస్పదం. అధికారం పోయాక ఎవరికి పిచ్చి పట్టిందో నియోజకవర్గ ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. నిజంగా సంతోష్ గౌడ్‌కు నైతికత ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.సంతోష్ గౌడ్ నివసిస్తున్న ఇల్లు మున్సిపల్, ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి కట్టింది కాదా అని హరీష్ గౌడ్ ప్రశ్నించారు. అది ప్రభుత్వ భూమి కాదని ఆధారాలతో మున్సిపల్ ఆఫీసులో నిరూపించాలన్నారు. సొంత భూములు అమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్న బాల్ రెడ్డి చరిత్రలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని స్పష్టం చేశారు. 2018లో స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన చరిత్ర సంతోష్ గౌడ్‌ది కాదా అని నిలదీశారు. మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ పీఠం కోసం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగితే, కార్యకర్తలు లోపలికి రానివ్వకుండా లొల్లి చేసిన ఉదంతాన్ని తాండూరు ప్రజలంతా చూశారని గుర్తుచేశారు. అధికారం కోసం రంగులు మార్చే అలవాటు తమకు లేదని, ఇకపై బాల్ రెడ్డి పై చౌకబారు విమర్శలు చేస్తే తాండూరు ప్రజల సాక్షిగా తగిన బుద్ధి చెబుతామని హరీష్ గౌడ్ హెచ్చరించారు.