- సంతోష్ గౌడ్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే కుట్రలు
- స్టేషన్ హనుమాన్ మాజీ డైరెక్టర్ నగేష్
జనవాహిని ప్రతినిధి తాండూరు: సీఎం, స్పీకర్ల జిల్లాల పరిధిలో అధికార పార్టీని వీడి, ప్రతిపక్షంలో చేరిన నెల రోజుల్లోనే కౌన్సిలర్‌గా ప్రజా తీర్పుతో గెలిచిన నాయకుడు సంతోష్ గౌడ్ అని, ఆయనను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివకుమార్‌కు లేదని స్టేషన్ హనుమాన్ మాజీ డైరెక్టర్ నగేష్ మండిపడ్డారు. వార్డులో నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే సంతోష్ గౌడ్ గెలిచేవారే కారని ఆయన స్పష్టం చేశారు. ఒక బీసీ నాయకుడిగా సంతోష్ గౌడ్ ఎదుగుతుండటం చూసి ఓర్వలేకే ఆయనపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ముక్కుసూటిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక చౌకబారు రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా తాము మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి కి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామని.. దమ్ముంటే తాము చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని నగేష్ డిమాండ్ చేశారు. కొంతమంది వ్యక్తులను ముందు పెట్టి అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేయిస్తే తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా తీర్పే తమకు బలమని, ప్రజల ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.