- కాంగ్రెస్ నాయకులపై బీసీ నేత రవి నిప్పులు
- కాంగ్రెస్ సంతోష్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే చౌకబారు రాజకీయాలు
- అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదవులు అమ్ముకున్న చరిత్ర మీది కాదా?
- బీసీ నాయకుడి ఎదుగుదలను చూసి ఓర్వలేకే బురదజల్లే యత్నం
తాండూరు, జనవాహిని ప్రతినిధి: ప్రజా సమస్యలపై నిలదీస్తున్న బీసీ నాయకుడు సంతోష్ గౌడ్‌ను రాజకీయంగా తట్టుకోలేక, ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగడం కాంగ్రెస్ నాయకుల చేతగానితనానికి నిదర్శనమని బీసీ నాయకుడు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాదరణతో ఎదుగుతున్న ఒక బీసీ నాయకుడిపై బురదజల్లేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు. బుధవారం తాండూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.సంతోష్ గౌడ్ అడిగిన అక్షరాల సత్యమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, తెరవెనుక ఉండి ఇతరులతో కౌంటర్లు ఇప్పించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని రవి విమర్శించారు. గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పదవులు అనుభవించి, ముఖ్య నాయకులకు సన్నిహిత అనుచరులుగా చలామణి అవుతూ రాజకీయ ప్రయోజనాలు పొందిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చేతనైతే ముందు ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఇరవై ఏళ్లకు పైగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సంతోష్ గౌడ్ ఎదుగుదలను అడ్డుకునేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రవి మండిపడ్డారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డిపై విరుచుకుపడుతూ.. ప్రజాస్వామ్యంలో విమర్శలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలి కానీ, ఇలాంటి వ్యక్తిగత దూషణలు సరికావు అని హితవు పలికారు. అధికార దాహంతో పదవులను డబ్బులకు అమ్ముకునే చరిత్ర ఉన్నవారే ఇవాళ విలువైన రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సంతోష్ గౌడ్‌ను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా తిప్పికొడతామని రవి హెచ్చరించారు. ప్రజా సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.