- బీసీలను అవమానించిన శివ చరణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- వెంటనే అరెస్ట్ చేసి, కాంగ్రెస్ నుండి బహిష్కరించాలి
- బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
- జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు: యాదవ మహిళలను, గౌడ కులస్తులను అసభ్యంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివ చరణ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ….యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టీ ఈశ్వరమ్మ యాదవ్‌తో పాటు బీసీ మహిళలను, గౌడ కులస్తులను కించపరిచేలా శివ చరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే యూత్ కాంగ్రెస్ పదవి నుండి తొలగించి, కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో బీసీలపై ఇలాంటి దాడులు, అవమానకర వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని రాజ్‌కుమార్ కోరారు. బీసీలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై వేగవంతమైన విచారణ జరిపి, కఠిన శిక్షలు పడేలా చట్టాన్ని రూపొందించాలన్నారు. బీసీల రాజ్యాంగ హక్కులను, ఆత్మగౌరవాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.