- మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డికి మతిస్థిమితం తప్పింది
- అభివృద్ధి జరగకపోతే మీకూ భాగస్వామ్యం ఉన్నట్లే!
- స్వార్థం కోసం పార్టీ మారిన మీకు కాంగ్రెస్ సంస్కృతి తెలుసా?
- బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సంతోష్ గౌడ్ బుధవారం ఖండించారు. ఈ సందర్బంగా… ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ…. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్యాయం జరిగిందంటూ బాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా, రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బాల్ రెడ్డి ఆయనకు అత్యంత ముఖ్య అనుచరుడిగా ఉండి రాజకీయంగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బాల్ రెడ్డి సతీమణి రెండు సార్లు కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించారని సంతోష్ గౌడ్ పేర్కొన్నారు. పదేళ్ల పాటు అధికారానికి అత్యంత ఆప్తుడిగా ఉండి, అన్ని రకాల లబ్ధి పొంది.. ఇప్పుడు పది సంవత్సరాలలో అభివృద్ధి జరగలేదు అని మాట్లాడటం అంటే, ఆ వైఫల్యంలో బాల్ రెడ్డి కి కూడా భాగస్వామ్యం ఉందని ఆయనే ఒప్పుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం రాగానే స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారి, గత ప్రభుత్వంపై బురద చల్లాలని చూడటం ప్రజలను మభ్యపెట్టే చౌకబారు ప్రయత్నమేనని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు బాల్ రెడ్డి ప్రజలకు కొన్ని సమాధానాలు చెప్పాలని సంతోష్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు.. ఎప్పుడు కార్యకర్తవలైయ్యారు ? ఏరోజైన కాంగ్రెస్ జెండా పట్టుకుని ప్రజా సమస్యలపై పోరాడిన రోజులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. కేవలం అధికారం కోసమే పార్టీలు మారే నాయకులను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బాల్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని సంతోష్ గౌడ్ హెచ్చరించారు.