గుప్పెడు గుండెకు... సింగరేణి గ‌ట్టి భరోసా!

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)
  • గుప్పెడు గుండెకు... సింగరేణి గ‌ట్టి భరోసా!
  • గోదావరిఖనిలో తొలి క్యాథ్ ల్యాబ్‌తో కోల్ బెల్ట్ ప్ర‌జ‌ల‌కు అత్యాధునిక గుండె వైద్య సేవలు
  • రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశం మేర‌కు ఏడాదిలోనే ఏర్పాటైన క్యాథ్ ల్యాబ్‌
  • ఏటా 6 కోట్ల వ్య‌యం అయ్యే అవ‌కాశం
  • గుండె జ‌బ్బు అత్యవసర చికిత్స ఇక స్థానికంగానే... వేలాది ప్రాణాలకు భరోసా
  • కార్మిక కుటుంబాల సంక్షేమం దిశ‌గా సింగ‌రేణి మ‌రో ముంద‌డుగు

సింగ‌రేణి భ‌వ‌న్‌, జూన్ 29, 2026 :- దేశానికి వెలుగులు పంచే కార్మికుల ఆరోగ్య పరిరక్ష‌ణ దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు సింగ‌రేణి సంస్థ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సంస్థ‌కు గుండెకాయ‌గా ఉన్న కార్మికుల హృద‌యాల‌కు గ‌ట్టి భ‌రోసా క‌ల్పించాల‌న్న ఉద్దేశంతో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్‌ను రామ‌గుండం-1 ఏరియా ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లో లాంఛ‌నంగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

సింగ‌రేణి కార్మికుల‌కు అత్యాధునిక‌ సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం అందించాల‌న్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఆదేశాల నేప‌థ్యంలో సింగ‌రేణి ఉద్యోగులు ఎక్కువ‌గా నివ‌సించే (దాదాపు 33 వేల మంది) గోదావ‌రిఖ‌ని ప్రాంతంలో సింగ‌రేణి సంస్థ తొలి క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయ‌డం విశేషం. దీంతో పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల‌, కొముర‌మ్ భీమ్ ఆసిఫాబాద్‌, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ భూపాల ప‌ల్లి జిల్లా ల్లో నివ‌సిస్తున్న వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు, విశ్రాంత సింగ‌రేణి ఉద్యోగుల‌తోపాటు స‌మీప గ్రామాల ప్ర‌జ‌ల హృద‌యాల‌కు సింగ‌రేణి గ‌ట్టి భ‌రోసాను ఇచ్చిన‌ట్లు అయింది.

క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు ఎందుకు?

గుండె స‌మ‌స్య అన్న‌ది నేడు వ‌యో భేదం లేకుండా ప్ర‌తీ ఒక్క‌రూ ఎదుర్కొంటున్న అతి ప్రాణాంత‌క జ‌బ్బు. ఇది ఎప్పుడు వ‌స్తుందో అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మే కానీ, ఈ స‌మ‌స్య త‌లెత్తిన తొలి గంట అత్యంత కీల‌క‌మ‌ని వైద్యులు పేర్కొంటారు. దీన్ని గోల్డెన్ అవ‌ర్‌గా పేర్కొంటారు. ఈ స‌మ‌యంలో స‌త్వ‌ర‌మే చికిత్స అందించ‌గ‌లిగితే విలువైన ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చు. అయితే సింగ‌రేణి విస్త‌రించిన ప్రాంతాల్లో కంపెనీ ఆధ్వ‌ర్యంలో అనేక ఆధునిక వైద్య సౌక‌ర్యాలు గ‌ల‌ ఏరియా ఆసుప‌త్రులు ఉన్న‌ప్ప‌టికీ అందులో కార్డియాక్ సంబంధిత సేవ‌లు ప‌రిమిత స్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు గుండెపోటు వచ్చిన రోగులను హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్ వంటి సుదూర నగరాలకు తరలించాల్సి వచ్చేది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో అమూల్యమైన "గోల్డెన్ అవర్" (రక్షించదగిన తొలి గంట) వృథా అవుతుండేవి. ఈ నేప‌థ్యంలోనే గోదావ‌రిఖ‌నిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ను సింగ‌రేణి ఏర్పాటు చేసింది.

ప్రాణాలను కాపాడే 'గోల్డెన్ అవర్' వైద్యం

గుండెపోటు వచ్చిన తొలి గంట అత్యంత కీలకం. అదే సమయంలో యాంజియోగ్రామ్‌, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందితే రోగి ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ అత్యవసర సేవ‌ల ప్రాధాన్య‌త‌ను గుర్తించిన సింగరేణి యాజమాన్యం, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతికతతో ఈ క్యాథ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. బొగ్గు బెల్ట్ ప్రజలకు సకాలంలో, తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

కార్మికుడి ఆరోగ్యమే సంస్థ సంపద

కార్మికుల ఆరోగ్యం కోసం సింగ‌రేణి సంస్థ ఏటా 300 కోట్ల రూపాయల‌కు పైగా వెచ్చిస్తోంది. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుప‌త్రుల రెఫ‌ర‌ల్స్ కోస‌మే అధిక మొత్తం నిధుల‌ను కేటాయిస్తోంది. గత ఏడాది మాత్రమే హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సుమారు 3,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి, బెల్లంపల్లి, రామగుండం, రామకృష్ణాపూర్ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయ‌డం జ‌రిగింది. అయితే గుండె జ‌బ్బుల విష‌యంలో ప్ర‌తీ నిమిష‌యం విలువైనదే కావడంతో లక్షల రూపాయలు వెచ్చించడం కంటే సకాలంలో అత్యాధునిక చికిత్స అందించడం ద్వారానే ప్రాణాలను కాపాడవచ్చనే దృఢ సంకల్పంతో సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మ‌రో మారు కార్మిక సంక్షేమంలో సింగరేణి దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తోందని ఈ ముందడుగు ద్వారా మరోసారి నిరూపించింది.

ఉత్తర తెలంగాణకు లభించిన వరం

గోదావ‌రిఖ‌నిలోని సింగ‌రేణి ఏరియా ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో మొత్తం 7890 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో సింగ‌రేణి కార్డియాల‌జీ విభాగం ఉంటుంది. ఇందులో 5 బెడ్ల సామ‌ర్థ్యం గ‌ల ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్‌, 10 బెడ్ల సామ‌ర్థ్యం తో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌, ప్ర‌త్యేక గ‌దుల‌తో ఔట్ పేషెంట్ బ్లాక్ ఉంటాయి..

గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, బెల్లంప‌ల్లి, పెద్దపల్లి, భూపాలపల్లి, మంథని తదితర పరిసర ప్రాంతాలతో పాటు మొత్తం కోల్‌ బెల్ట్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలకు ఈ క్యాథ్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది. ప‌బ్లిక్‌-ప్రైవేట్ భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ కోసం ఏడేళ్ల‌లో సింగ‌రేణి సంస్థ దాదాపు 50 కోట్ల ఖ‌ర్చును భ‌రించ‌నుంది. అలాగే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ హెల్త్ స్కీమ్ టారిఫ్‌ల మేర‌కు అతి త‌క్కువ ఖ‌ర్చుతో స్థానికుల‌కు కూడా అత్యాధునిక వైద్య సేవ‌ల‌ను అందించే సౌక‌ర్యాన్ని క‌ల్పించింది. ప్ర‌తీ నెల దాదాపు 3 వేల మందికి పైగా ఈ సేవ‌ల‌ను వినియోగించుకుంటార‌ని అంచ‌నా. అయితే ఇక్క‌డ క్యాథ్ ల్యాబ్ ఉన్న బెడ్ల సామ‌ర్థ్యంలో 50 శాతం సింగ‌రేణి ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు, విశ్రాంత సింగ‌రేణీయుల‌కు రిజ‌ర్వు చేయ‌డం జ‌రుగుతుంది.

గోదావ‌రిఖ‌ని క్యాథ్ ల్యాబ్ లో సేవలు

ఈ క్యాథ్ ల్యాబ్‌లో గుండెకు సంబంధించిన అత్యాధునిక పరీక్షలు మరియు చికిత్సలు అందుబాటులో ఉంటాయి:

• రక్తనాళాల పరీక్షలు: గుండె నరాల్లో బ్లాక్‌లను గుర్తించే పరీక్షలు.

• యాంజియోగ్రామ్‌ & యాంజియోప్లాస్టీ: గుండెపోటు తీవ్రతను అంచనా వేసి, తక్షణ ఉపశమనం కలిగించే చికిత్సలు.

• స్టెంట్ అమరిక: ప్రాణాపాయం నుండి రక్షించే స్టెంటింగ్ ప్రక్రియలు.

• ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ: అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య సిబ్బందితో నిరంతర సేవలు.

స్థానికంగానే సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు అందించ‌డం ద్వారా విలువైన ప్రాణాల‌కు భ‌రోసా క‌ల్పించాల‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు సింగ‌రేణి యాజ‌మాన్యం ఈ క్యాథ్ ల్యాబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు సింగ‌రేణి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ శ్రీ కిర‌ణ్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఇక‌ సుదూర ప్రాంతాల‌కు త‌ర‌లించ‌కుండా, ఇకపై గోల్డెన్ అవర్‌లోనే అత్యవసర చికిత్స అందించడం ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడే కేంద్రంగా గోదావరిఖని క్యాథ్ ల్యాబ్ నిలవనుందని ఆయన పేర్కొన్నారు.

-చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్‌

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

Leave a Reply

Your email address will not be published.Required fields are marked *