తిరుమలలో ముమ్మరంగా ‘ట్రైన్ ది ట్రైనర్స్’
శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించడానికి టీటీడీ 43 రోజులపాటు నిర్వహించిన శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ రెండో విడత శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జూలై 1వ తేదీన ప్రారంభమైన ఈ రెండో విడత శిక్షణలో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 1,888 మంది శ్రీవారి సేవ గ్రూప్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. మొదటి బ్యాచ్ తో కలిపి ఇప్పటి వరకు దాదాపు 3,000 వేల మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు.
శ్రీవారి సేవకుల్లో సేవా నైపుణ్యాలు, సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. శిక్షణ పొందిన ట్రైనర్లు తమ తమ మండలాలు, జిల్లాల్లో ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న సేవకులకు తిరుమలకు వచ్చే ముందే శిక్షణ అందించాల్సి ఉంటుంది. దీనివల్ల శ్రీవారి సేవకులు మరింత నాణ్యమైన సేవలను అందించగలుగుతారని టీటీడీ భావిస్తోంది.

వేద పాఠశాల అధ్యాపకులు, టీటీడీలోని వివిధ విభాగాల నిపుణులు, ఉపన్యాసకులు శ్రీవారి వైభవం, తిరుమల మహత్యం, పురాణ ప్రాశస్త్యం, పూజలు, కైంకర్యాల విశిష్టత, శ్రీవారి సేవ ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో భాగంగా లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రిసెప్షన్ తదితర సేవా కేంద్రాలను వాళ్లు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సేవలు, సేవకుల బాధ్యతలు, వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలు, వాటిని సమర్థవంతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
ప్రతి బ్యాచ్‌లో సుమారు 200 మంది సేవకులకు శిక్షణ అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ కిట్, గ్రూప్ సూపర్‌వైజర్ మాన్యువల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రచురించిన గోవింద నామాలు, భగవద్గీత, శ్రీనివాస గాథ, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం తదితర గ్రంధాలను అందించారు. గ్రూప్ సూపర్‌వైజర్ల పని తీరును పర్యవేక్షించడానికి ఆగస్టు 1వ తేదీన అయిదుమంది రిటైర్డ్ అధికారులను సైతం టీటీడీ నియమించింది.
ఎన్‌సీసీటీ మాజీ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ హెచ్‌ఆర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎస్ఎల్ఎన్టీ శ్రీనివాస్, టీటీడీ సీపీఆర్‌వో డాక్టర్ టీ రవి, పీఆర్వో నీలిమ, శ్రీవారి సేవా విభాగం సమన్వయకర్తలతో కలిసి ఈ శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీవారి సేవ ట్రైన్ ది ట్రైనర్స్ తొలి విడత శిక్షణలో 1,011 మంది గ్రూప్ సూపర్‌వైజర్లు శిక్షణ పొందారు. వారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రెండో విడతలో కనీస విద్యార్హతగా డిగ్రీని నిర్దేశించడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరించారు.


