HomeNewsపెద్దాయన వస్తే చాలు...!

పెద్దాయన వస్తే చాలు…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఎమ్మెల్యే వెనకాలే కౌన్సిలర్లు
  • తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రజల ఆగ్రహం
  • వార్డుల వైపు కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు 
  • తెరపైకి ‘షాడో’ కౌన్సిలర్ల అవతారాలు.. మహిళా కౌన్సిలర్ల భర్తలు, కుటుంబ సభ్యుల హడావుడి
  •  గత కొన్ని రోజులుగా పట్టణంలో ఇదే చర్చ….! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజా సమస్యలు తాండవిస్తుంటే, వాటిని పరిష్కరించాల్సిన పాలకులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరు పట్టణ పరిధిలోని పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమ స్వంత వార్డులను, అక్కడ తమను గెలిపించిన ప్రజలను వదిలేసి, నిరంతరం ఎమ్మెల్యే వెనకాలే తిరుగుతున్నారని స్థానిక వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెరపైకి ‘షాడో’ కౌన్సిలర్లు.. తీవ్ర విమర్శలు!

తాండూరు మున్సిపాలిటీలో మరో విచిత్రమైన పరిస్థితి నెలకొందని పట్టణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ గెలిచిన మహిళా కౌన్సిలర్లు వార్డుల్లోగానీ, అధికారిక కార్యక్రమాల్లోగానీ పెద్దగా కనిపించడం లేదు. వారికి బదులుగా వారి కుటుంబ సభ్యులు, భర్తలు తామే కౌన్సిలర్లుగా చలామణి అవుతూ సర్వత్రా వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రజా సమస్యలపై అవగాహన లేని వీరు వార్డులను పట్టించుకోకపోగా, ఎమ్మెల్యే తాండూరుకు వచ్చిన ప్రతిసారీ ప్రోటోకాల్ కోసం ముందు వరుసలో నిలబడుతున్నారని, ఈ ‘షాడో’ కౌన్సిలర్ల హడావుడి పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

సమస్యల వలయంలో వార్డులు..

పట్టణంలోని పలు వార్డుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రతకు తోడు పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. దీనికి తోడు మురుగు కాలువలు , సీసీ రోడ్ల పనులు సగంలోనే మిగిలిపోయి అధ్వానంగా తయారయ్యాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అనేక ప్రజా సమస్యలు పక్కన పెట్టి, ఎమ్మెల్యే తాండూర్‌కు వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వెనకాలే తిరుగుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

మండల కార్యక్రమాల్లోనూ పట్టణ నాయకుల జోక్యం!

కౌన్సిలర్ల తీరుపై కేవలం పట్టణంలోనే కాకుండా మండల పరిధిలోనూ ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ పరిధిలోని సమస్యలను పరిష్కరించాల్సిన పట్టణ నాయకులు, కౌన్సిలర్లు.. మున్సిపాలిటీని వదిలిపెట్టి మండల పరిధిలో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ హడావుడి చేస్తున్నారనే విమర్శలు వ్యెక్తం అవుతున్నాయి.గెలిచిన నాటి నుండి నేటి వరకు వార్డుల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని, ఇప్పటికైనా కౌన్సిలర్లు మరియు వారి ప్రతినిధులు ఎమ్మెల్యే భజన పక్కన పెట్టి, వార్డుల్లో పర్యటించి తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తాండూరు పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments