Friday, February 6, 2026
Home NEWS తాండూరు ‘గులాబీ’లో గూడుపుఠాణీ..!

తాండూరు ‘గులాబీ’లో గూడుపుఠాణీ..!

0
46
  •  మున్సిపల్ ఎన్నికల వేళ ముదురుతున్న వర్గపోరు
  •  పాత, కొత్త నేతల మధ్య ‘ఈగో’ వార్.. తలపట్టుకుంటున్న కార్యకర్తలు
  • -ఎవరికి వారే ‘జాబితాలు’.. మాజీ ఎమ్మెల్యేకు టికెట్ల తలనొప్పి
  • సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించేందుకు కుట్రలు?

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఊహాగానాల వేళ, అధికార కాంగ్రెస్‌తో పోరు కంటే బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత కలహాలే ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. పైకి అంతా బాగానే ఉన్నా.. లోపల మాత్రం ‘పైన పటారం.. లోన లొటారం’ అన్న చందంగా పార్టీ పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2018 ఎన్నికల నుండి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెన్నంటి ఉన్న నాయకులు ఇప్పుడు ఆయనకు దూరమవుతున్నారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న తమను కాదని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోహిత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన వారికే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని పాత కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గతంలో మహేందర్ రెడ్డి వెన్నంటి ఉండి, ఆ తర్వాత గులాబీ గూటికి చేరిన నాయకులు సైతం తమకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికి వారే యమునా తీరే..అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న పట్లోళ్ల నర్సింలు కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరిగింది. మరోవైపు అభ్యర్థుల జాబితా విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒక లిస్టు తయారు చేయగా.. సీనియర్ నేతలు రాజు గౌడ్, నరేందర్ గౌడ్ తమ అనుచరుల కోసం మరో లిస్టు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.  ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి రోహిత్ రెడ్డితో చేతులు కలిపిన డాక్టర్ సంపత్ కుమార్ కూడా తనదైన శైలిలో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడం పార్టీలో కొత్త చిచ్చుకు దారితీసిందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

సొంత గూటికే కన్నం!

టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత దక్కలేదని భావిస్తున్న కొందరు నేతలు.. తమ ప్రత్యర్థి వర్గం ప్రతిపాదించిన అభ్యర్థులను ఓడించేందుకు లోపాయికారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మనకు దక్కనిది.. మన ప్రత్యర్థి వర్గానికి దక్కకూడదు అనే ఇగో ఫీలింగ్ పార్టీ విజయవకాశాలను దెబ్బతీసేలా ఉంది.నేతల మధ్య నెలకొన్న ఈ సమన్వయ లోపం, వర్గపోరు అంతిమంగా పార్టీ కొంపముంచుతుందని కార్యకర్తలు భయాందోళన చెందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అందరినీ ఏకం చేసి పార్టీని గట్టెక్కిస్తారా? లేక ఈ అంతర్గత విభేదాలు ప్రత్యర్థులకు వరంగా మారుతాయా? అన్నది వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here