గోపీచంద్ రికార్డును ఇంతవరకు ఏ తెలుగు స్టార్ హీరో బీట్ చేయలేకపోయారు
టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ కెరీర్‌లో ‘జయం’ సినిమా ఒక మైలురాయి. ప్రముఖ దర్శకుడు తేజ మలిచిన ఈ సంచలన ప్రేమకథా చిత్రంలో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా పరిచయం కాగా, విలన్‌గా గోపీచంద్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. “వెళ్తావా.. వెళ్తావా” అంటూ ఆయన పలికించిన క్రూరత్వం, బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసింది.
పగ, ప్రతీకారాలతో
ఈ సినిమాలో ‘రఘు’ అనే పగ, ప్రతీకారాలతో రగిలిపోయే భూస్వామ్య అహంకార యువకుడి పాత్రలో గోపీచంద్ జీవించేశారు. కేవలం 22 ఏళ్ల ప్రాయంలోనే అంతటి పరిణతి చెందిన నటనను కనబరిచి, ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో ఆయన పండించిన విలనిజానికి గానూ ఉత్తమ విలన్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ‘నంది అవార్డు’ వరించింది. ఇంత చిన్న వయసులోనే బెస్ట్ విలన్‌గా నంది పురస్కారం అందుకోవడం తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన రికార్డు.

ఇప్పటికీ ఆ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. నిజానికి గోపీచంద్ సినీ ప్రస్థానం వెనుక ఒక విషాదం, పెద్ద పోరాటమే ఉన్నాయి. ఆయన టాలీవుడ్ లెజెండరీ విప్లవాత్మక దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. గోపీచంద్ చిన్న వయసులోనే తండ్రి కన్నుమూశారు. దాంతో రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన గోపీచంద్, తండ్రి ఆశయాలను నిజం చేయడానికే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
తొలివలపుతో తొలిసారిగా
ఆయన మురళీ మోహన్ నిర్మించిన ‘తొలివలపు’ (2001) అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. హీరోగా మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు తగ్గిన తరుణంలో, దర్శకుడు తేజ ‘జయం’లో నెగెటివ్ పాత్రను ఆఫర్ చేశారు. హీరోగా సెటిల్ అవ్వాల్సిన సమయంలో విలన్ పాత్ర చేయడం పెద్ద రిస్క్ అయినప్పటికీ, కథపై నమ్మకంతో గోపీచంద్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ‘జయం’ ఇచ్చిన గ్రాండ్ సక్సెస్‌తో మహేష్ బాబు ‘నిజం’ సినిమాలో, ప్రభాస్ ‘వర్షం’ సినిమాలో మోస్ట్ పవర్‌ఫుల్ విలన్‌గా నటించి మెప్పించారు.
ముఖ్యంగా ‘వర్షం’లో భద్ర పాత్ర గోపీచంద్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారి, వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ, ఆయన మళ్లీ హీరోగా నిరూపించుకోవాలనుకున్నారు. ఆ క్రమంలోనే వచ్చిన ‘యజ్ఞం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయి, ఆయనను మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత రణం, శౌర్యం, లౌక్యం వంటి చిత్రాలతో ‘మ్యాచో స్టార్’గా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు.









