త్రిశూలమే భర్తగా….

Sri Raja Rajeshwara Swamy Devasthanam: శివ కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుంచి శివపార్వతులుగా పిలువబడే జోగినీలు భారీగా తరలివచ్చారు. ఓ వైపు శివ కళ్యాణం జరుగుతుంటే అదే ముహుర్తాన మరో వైపు త్రిశూలమే భర్తగా భావిస్తు జోగినీలు వివాహం చేసుకున్నారు. త్రిశూలానికి బాసింగం కట్టి, నెత్తిన జిలకర్రబెల్లం పెట్టుకుని మెడలో లింగంకాయ మంగళసూత్రంగా భావిస్తు శివుడితో పెళ్ళి అయినట్లు తమకు తాము అక్షింతలు వేసుకున్నారు. శివ కళ్యాణానికి ముందు జోగినీలు జోలెపట్టి ఐదు ఇళ్ళు తిరిగి భిక్షాందేహి అంటు అడుకుంటారు. అనంతరం జంగమయ్య వద్ద దారణ చేసుకుని మెడలో లింగం కాయకట్టుకుంటారు. ఆ లింగం కాయనే మంగళసూత్రంగా భావిస్తారు. ఈ వింత ఆచారాన్ని స్త్రీ పురుష వయోభేదం లేకుండా పాటిస్తారు. పురుషులైతే స్త్రీ వేషాదారణలో శివ కళ్యాణానికి హాజరై శివుడిని పెళ్ళి చేసుకుంటారు. ఇంట్లో ఒంట్లో బాగా లేకుంటే వేములవాడ రాజన్నకు మొక్కడంతో అంతాబాగుండడంతో శివుడికే అంకితం అవుతున్నామని జోగినీలు తెలిపారు. కొందరు దేవుడి పేరుమీదనే వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతుండగా మరికొందరు మాత్రం వివాహం చేసుకుని భార్యపిల్లలతో ఉంటారని శివపార్వతులు చెప్పారు. అనాదిగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.