ఊటీ

దీన్ని ఉదగమండలం అని పిలుస్తారు. ఇది ఒక అందమైన కొండపట్టణం. తమిళనాడులోని నీలగిరి కొండల మధ్యలో ఉంది ఇది. ఏడాది పొడవునా చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిండి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది ఒకటి. వేసవి సెలవులు వస్తే ఎంతోమంది ఊటీకి రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న సుసంపన్నమైన వృక్ష సంపద, కొండలు కళ్ళకు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఉండే సొరంగాలు, వంతెనలు, జలపాతాలు, అందమైన గ్రామీణ ప్రాంతాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడున్న బొటానికల్ గార్డెన్స్ లో అరుదైన ఆర్కిడ్లు, బోన్సాయి మొక్కలు… ఇలా ఎన్నో విదేశీ మొక్కలు అలరిస్తాయి. ఊటీ సరస్సు ఒడ్డున కూర్చుంటే అక్కడ నుంచి రావాలనిపించదు. పర్వతాలలో ట్రెక్కింగ్, క్యాంపింగ్, గుర్రపు స్వారీ వంటి ఎన్నో కాలక్షేపాలు సిద్ధంగా ఉంటాయి. ఊటీలో చేత్తో చేసిన చాక్లెట్లు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా తిని తీరాల్సిందే. ఊటీని చూడడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి జూన్ నెల మధ్య. అక్కడ వాతావరణం చాలా అందంగా ఉంటుంది. ఊటీకి దగ్గరలో ఉన్న విమానాశ్రయం కోయంబత్తూర్. అదే సమీప రైల్వే స్టేషన్ మెట్టుపాళయం.