posted on Mar 23, 2024 10:28AM

బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయమైతే తీసేసుకుంది కానీ, పొత్తులో భాగంగా తాము పట్టుబట్టి మరీ తీసుకున్న స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.  ఈ సీటు.. కాదు కాదు ఆ సీటు అంటూ ఏపీ బీజేపీ నేతలు ఎక్కడా తమకు లేని విజయావకాశాలను పొత్తులో భాగంగా తమకు వచ్చిన నియోజకవర్గాలలో వెతుకులాటలో తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. పొత్తులో భాగంగా ఇప్పటి వరకూ బీజేపీ పోటీ చేస్తుందని అంతా భావిస్తూ వచ్చిన రాజంపేట లోక్ సభ నియోజకవర్గం తిరిగి తెలుగుదేశం కోటాకు బదలీ అయ్యింది. అందుకు బదులుగా బీజేపీ కడపలో పోటీకి దిగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో దివంగత వైఎస్  కుటుంబ సభ్యులు పరస్పరం పోటీ పడుతున్న నేపథ్యంలో  అక్కడ పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  కడప లోక్ సభ స్థానం నుంచి  వైసీపీ  అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ షర్మిలారెడ్డి పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో   వైఎస్ అభిమానుల ఓట్లు భారీ స్థాయిలో చీలిపోయే పరిస్థితి ఉందని భావిస్తున్న బీజేపీ అక్కడ తమ అభ్యర్థిని నిలబెడితే విజయం సునాయాసమని ఆశిస్తోంది.   ఆ స్థానం నుంచి సీఎం రమేష్, లేదా ఆదినారాయణరెడ్డిలను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  

కాగా ఇప్పటివరకూ బీజేపీకి వెళ్లిందని భావిస్తున్న రాజంపేట ఎంపీ సీటు, తాజాగా తిరిగి టీడీపీ కోటాకు బదిలీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజంపేట లోక్ సభ నియోజకవర్గ  పరిథిలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉన్నందున  ఆ స్థానంలో బీజేపీ పోటీకి నిలిస్తే  ఓట్లు పడే అవకాశాలు తక్కువ అన్న భావనతో రాజంపేటను వదులుకుని విజయనగరం ఇవ్వాలని కమలం పార్టీ కోరుతున్నట్లుగా చెబుతున్నారు.  హిందూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించడంతో బీజేపీ   అనంతపురం లోక్ సభ స్థానం కోరుతోంది.  

అదే విధంగా అసెంబ్లీ నియోజవకరగాల విషయంలో  బీజేపీ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒక వేళ కడప ఎంపీ సీటు తీసుకుంటే, టీడీపీ ఇచ్చిన ఒకటి, జనసేన ఇచ్చిన 3 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి వదిలేసే అవకాశాలున్నాయని బీజేపీకి చెందిన  ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. అప్పుడు అసెంబ్లీ బరిలో  బీజేపీ బలమైన కొద్ది మంది అభ్యర్ధులను మాత్రమే బరిలోకి దింపుతుందని అంటున్నారు. వాస్తవ బలాన్ని మించి పొత్తు చర్చల్లో పట్టుబట్టి మరీ ఎక్కవ స్థానాలను దక్కించుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ స్థానాలలో  నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకక ఇబ్బందులు పడుతున్నది.  పొత్తులో భాగంగా దక్కించుకున్న స్థానాలలో ఇప్పటి వరకూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన నేతలను నిలబెట్టడం సరికాదనీ, అలా జరిగితే ఓట్లు బదలీ అయ్యే అవకాశాలు ఉండవనీ చర్చల సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పిన నేపథ్యంలో బీజేపీ ఇంత కాలం వైసీపీతో అంటకాగిన కొందరు నేతలను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పొత్తులో భాగంగా వచ్చిన స్థానాలలో నిలబెట్టే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ పార్టీ అభ్యర్థులుగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి,  అలాగే రఘురామకృష్ణం రాజు. కొత్తపల్లి గీత, సీఎం రమేష్  పేర్లు మాత్రమే ఖరారయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శనివారం సాయంత్రానికల్లా బీజేపీ తరఫున ఏపీలో పోటీ చేయనున్న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీలో అభ్యర్థుల ప్రకటనలో జరుగుతున్న జాప్యం కారణంగా పొత్తు ప్రమాదంలో పడిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో ఎలాంటి పొరపొచ్చాలూ లేవనీ, మిత్ర ధర్మానికి అనుగుణంగానే తమ అడుగులు పడుతున్నాయనీ స్పష్టం చేసింది. అదే విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీలూ చెబుతున్నాయి.