Sangareddy News : పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరమని, చలికాలంలో పరిమితవేగం సురక్షితమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పొగ మంచుతో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు పరిమితవేగంతోనే వెళ్లి ప్రాణాలను రక్షించుకోవాలని ఎస్పీ సూచించారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయి, పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించని పరిస్థితులు ఏర్పడి, అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని, రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రత్తలు మరింత కనిష్ట స్థాయికి చేరి, జిల్లాను పొగమంచు కమ్మేసే అవకాశం ఉందన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై పొగమంచు ఏర్పడటం వలన ప్రయాణం ప్రమాదభరితంగా మారే అవకాశం ఉంటుందన్నారు. వాహనాల నుంచి వెలుపడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా మారుతుందని, వాహనానికి లైట్లు వేసుకున్నా.. కొంత దూరంలో ఉన్న వాహనాలు కూడా దగ్గరకు వచ్చే వరకు కనిపించవని, ఈ సమయంలో వేగంగా ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు చోటు చేసుకుంటాయన్నారు. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పొగమంచు అధికంగా ఉండటం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.