- సర్వే నెం. 135లో అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలి
- కమిషనర్‌కు బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ల వినతి
- సర్వే నెం. 111 అక్రమార్కులే ఇక్కడా ఉన్నారంటూ ఆరోపణ
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ పట్టణం సర్వే నెం. 135లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ… సర్వే నెం. 135లోని ప్రభుత్వ భూమిలో కొంతమంది చట్టబద్ధమైన లీజుదారులు మరియు హక్కుదారులు ఉన్నప్పటికీ, కొంత భూభాగంలో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.గతంలో సర్వే నెం. 111లో వివాదాస్పద నిర్మాణాలు, ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులే ఇప్పుడు సర్వే నెం. 135లో కూడా అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని, ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు తేలితే ఆ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కౌన్సిలర్లు కమిషనర్‌ను కోరారు.





