మోహన్‌లాల్ కూతురు డెబ్యూ మూవీ.. మూడేళ్ళ తర్వాత ‘2018’ డైరెక్టర్ సంచలనం.!
Aug 5, 2026 6:40PM

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ హీరోయిన్ గా చిత్రసీమలోకి అడుగుపెడుతున్న తొలి చిత్రం ‘తుడక్కమ్’ (Thudakkam). ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆశీష్ జో ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘2018’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు జ్యూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ నెట్టింట విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతూ విశేష ఆదరణ పొందుతోంది.
‘తుడక్కమ్’ ట్రైలర్ విషయానికి వస్తే, కేవలం 1 నిమిషం 35 సెకన్ల వ్యవధిలోనే తీవ్రమైన ఉత్కంఠను పెంచేలా కట్ చేశారు. విస్మయ మోహన్‌లాల్ తొలి చిత్రంలోనే ఒక డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఒక సాధారణ కుటుంబ నేపథ్యం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు, చదువు, ఉద్యోగం, అద్దె ఇల్లు చుట్టూ తిరిగే సన్నివేశాలతో మొదలయ్యే ట్రైలర్, క్రమంగా తీవ్రమైన సస్పెన్స్, డ్రామా వైపు మళ్లుతుంది.
ట్రైలర్‌లో విస్మయ నటన, ఆమె బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. “ఒకప్పుడు జరిగిన ఆ ఘటనను నాన్న ఇక గుర్తుచేసుకోవద్దు, అప్పుడు ఒక తప్పు జరిగింది.. ఇకపై అది జరగదు” అని విస్మయ చెప్పే ఇంటెన్స్ సంభాషణలు కథలో ఉన్న సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెలియజేస్తున్నాయి. అలాగే “నా చేతులతోనే చంపేయాలి” అనే డైలాగ్స్, ఇల్లు ఖాళీ చేయడం, బెదిరింపులు, ప్రమాదకరమైన మలుపుల చుట్టూ సాగే దృశ్యాలు ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాగా రూపొందిందని సంకేతాలు ఇస్తున్నాయి.
స్టార్ కిడ్ అయినప్పటికీ విస్మయ ఎంచుకున్న కథ, ఆమె పండించిన సహజమైన హావభావాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. జ్యూడ్ ఆంథనీ జోసెఫ్ తన మార్కు టేకింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్ మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మోహన్‌లాల్ అభిమానులతో పాటు మలయాళ సినీ ప్రియులు విస్మయ ఎంట్రీపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





