ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఇదే..
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019 లో దొరసాని చిత్రంతో ఆయన టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అంతకుముందు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడిగా చాలా మందికి సుపరిచితమే కానీ దొరసాని సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా మారాడు. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలి సినిమా అయినా ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో తన మెచ్చూరిటీ, సెటిల్డ్ నటనతో మెప్పించాడు.
ఆ తర్వాత 2020 లో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేశాడు ఆనంద్ దేవరకొండ. ఈ మూవీ అతని కెరీర్ లో మంచి హిట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత 2021 లో వచ్చిన పుష్పక విమానం సినిమా పర్వాలేదనిపించినా.. 2023 లో వచ్చిన బేబీ చిత్రం ఆనంద్ దేవరకొండ కెరీర్ ను మలుపుతిప్పింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం రూ. 10 కోట్లతో తీసిన ఈ మూవీ థియేటర్లలో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఆనంద్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
బేబీ మూవీలో ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. ఈ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు మరోసారి ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య కలిసి ఎపిక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో మరోసారి యువతను ఆకట్టుకునేందుకు రానుంది. దాంతో ఎపిక్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ టీమ్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎపిక్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ మూవీ రేంజ్ ను మించిన విజయం ఈ సినిమాకు దక్కుతుందని నెటిజన్లు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.





