- తాండూరులో రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్ పార్క్ ఏర్పాటు
- భూమిపూజ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్
- ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందిస్తాం
జనవాహిని ప్రతినిధి తాండూరు: పట్టణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, వినోద వసతులు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేపడుతోందని కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్ తెలిపారు. తాండూరు పట్టణ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో రూ.5 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వెంకట్ జుంటుపల్లి మాట్లాడుతూ… ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణంలోని ప్రతి వార్డులో వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలు నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఈ ఓపెన్ జిమ్ ఎంతో దోహదపడుతుందని, వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కమిషనర్,పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.





