- ప్రభుత్వ స్థలాలకు ‘కాబ్జా’ గ్రహణం
- ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు… జెండా పాతేస్తున్న భూబకాసారులు
- నోట్ల’ మత్తులో అధికారులు… ‘ప్యాకేజీల’ సైలెన్స్‌లో నాయకులు!
- ఇంకెన్ని ఎకరాలు బలికావాలి?
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని చెప్పవచ్చు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఏదో ఒక పేరుతో ఆక్రమించుకోవడం, రాత్రికి రాత్రే కట్టడాలు లేపేయడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. రిజిస్ట్రేషన్ కానీ భూములను సైతం కాబ్జా లు చేసి తమ పేరు పైకి రిజిస్ట్రేషన్ లు చేసుకొని అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు తాండూరు లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒకవైపు భూబకాసారులు విలువైన సర్కారు స్థలాలను కబళిస్తుంటే, మరోవైపు పబ్లిక్ ఆస్తులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.పట్టణ పరిధిలోని అత్యంత విలువైన సర్వే నంబర్లు 4, 130, 111, 135 లతో పాటు పలు ప్రభుత్వ స్థలాల్లో బహిరంగంగానే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల పాలువుతున్నా, వాటిని పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులకు కనీస సోయి లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు కళ్లముందే కనిపిస్తున్నా, వాటిని అడ్డుకునే దమ్ము, ధైర్యం మున్సిపల్ అధికారులకు లేకుండా పోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఓట్ల కోసం ఆరాటపడే ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నోట్లు సంపాదించే తాపత్రయంలో పడ్డారని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. బెదిరింపులు, పైరవీలు, ముడుపుల ప్యాకేజీల ఆధారంగానే తాండూరులో వ్యవహారాలు నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు సైతం ‘ప్యాకేజీల’కే పరిమితమై నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.తాండూరులో ఇక ఎన్ని ప్రభుత్వ స్థలాలు అక్రమార్కుల పాలవుతాయో, ఎంతమంది అధికారులు ముడుపులకు లొంగిపోతారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఆక్రమణకు గురైన సర్వే నంబర్లలో విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
