పవన్ కళ్యాణ్ బాటలో అన్నా కొణిదెల.. 6,30,000 రూపాయలతో
Aug 1, 2026 6:09PM

ఈ రోజుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సతీమణి అన్నాకొణిదెల(Anna Konidela)పుట్టినరోజు. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని విశాఖపట్నంలోని ప్రముఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో ఉన్న రెండు అరుదైన మూగజీవులని ఏడాది కాలం పాటు దత్తత తీసుకుని, వన్యప్రాణి సంరక్షణ పట్ల తనకున్న అమితమైన ప్రేమ చాటుకున్నారు. పండగలు, పుట్టినరోజులు అంటే కేవలం ఆడంబరాలు, కేక్ కటింగ్ వేడుకలకే పరిమితం కాకుండా, ప్రకృతికి, జీవ వైవిధ్యానికి తోడ్పడేలా అత్యంత ఆదర్శవంతమైన రీతిలో ఆమె తన ప్రత్యేక దినాన్ని జరుపుకోవడం విశేషం.
విశాఖ ఇందిరా గాంధీ జూ పార్క్ లోని జంతువుల సంరక్షణ పథకం కింద అన్నా కొణిదెల ఒక ఆసియా ఏనుగును, ఒక రాయల్ బెంగాల్ టైగర్ ను దత్తత తీసుకున్నారు. భారత జాతీయ వారసత్వ జంతువుగా గుర్తింపు పొందిన ఆసియా ఏనుగు ఆహారం, వైద్యం, పోషణ మరియు వసతి సౌకర్యాల సంరక్షణ నిమిత్తం ఏడాదికి రూ. 4,30,000 సమర్పించారు. అదేవిధంగా భారత జాతీయ జంతువైన, గంభీరతకు ప్రతీకగా నిలిచే రాయల్ బెంగాల్ టైగర్ సంరక్షణ కోసం 2,00,000 విరాళంగా అందించారు. ఇలా రెండు వన్యప్రాణుల దత్తత కోసం మొత్తం 6,30,000 భారీ మొత్తాన్ని చెల్లించారు. ఈ దత్తత ద్వారా సమకూరిన 6.30 లక్షల నిధులను జూలోని ఈ రెండు జీవుల దైనందిన ఆహార అవసరాలు, సంపూర్ణ పోషకాహారం, నిరంతర పశువైద్య సేవలు, ఎన్విరాన్మెంటల్ ఎన్రిచ్మెంట్ మరియు ఇతర సంరక్షణ చర్యల కోసం వినియోగించనున్నట్లు విశాఖ జూ పార్క్ క్యూరేటర్ జి. మంగమ్మ వెల్లడించారు. సమాజంలో ప్రతిష్టాత్మక హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావడం ఎంతో అభినందనీయమని క్యూరేటర్ పేర్కొన్నారు. అన్నా కొణిదెల తీసుకున్న ఈ సత్సంకల్పం మూగజీవుల సంక్షేమానికి తోడ్పడటమే కాకుండా, ప్రజల్లో అటవీ జీవుల పట్ల అవగాహన పెంచడానికి ఎంతగానో దోహదపడుతుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
అటవీ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్ కుటుంబం నుండి ఇలాంటి పర్యావరణ అనుకూలమైన నిర్ణయం రావడం పట్ల ప్రకృతి ప్రేమికులు, జనసైనికులు మరియు సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల వంటి శుభకార్యాల సందర్భంగా విశాఖ జూలోని జంతు దత్తత కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80జి(5) కింద ఈ దత్తత విరాళాలకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుండటం గమనార్హం.
Also read: Toxic: మరోసారి టాక్సిక్ వైరల్.. కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్
అన్నా కొణిదెల చూపిన ఈ ఉదారత సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది. జంతువులను దత్తత తీసుకోవడం ద్వారా మానవత్వంతో పాటు ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చని ఆమె నిరూపించారు. 625 ఎకరాల విస్తీర్ణంలో 1000కి పైగా జంతువులకు నిలయంగా ఉన్న విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ అభివృద్ధికి, జీవుల శ్రేయస్సుకు ఇటువంటి విరాళాలు ఎంతో తోడ్పడతాయి. పవన్ కళ్యాణ్ సతీమణి తీసుకున్న ఈ నిర్ణయం స్పూర్తితో మరింత మంది యువత, ప్రముఖులు ముందుకు వచ్చి మూగజీవులను ఆదుకుంటారని ఆశిద్దాం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని ఏనుగులని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
Anna konidela, Pawan Kalyan
