అతి తక్కువ ధరకే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. రోజూ ఉద్యోగానికి వెళ్లేవారికి మంచి ఛాయిస్!
పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈవీ తయారీ సంస్థ కోమాకి (Komaki) తన వాహనాలను మరింత విస్తరించింది. బడ్జెట్ ధరలో మంచి రేంజ్, అధునాతన ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చూస్తున్న వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీ ఎంజీ ప్రో వీ (MG Pro V), ఎంజీ ప్రో ప్లస్ (MG Pro+) పేర్లతో రెండు కొత్త మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా నగరాల్లో చేసే ప్రయాణాలకు అనువుగా, తక్కువ మెయింటనెన్స్ ఖర్చుతో కూడిన స్కూటర్లను కోరుకునే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ కొత్త మోడళ్లను తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.
పైగా వీటిని అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసే విధంగా బడ్జెట్ ధరలోనే లాంచ్ చేయడం విశేషం. ఈ రెండు స్కూటర్లలో MG Pro V ఎక్స్-షోరూమ్ ధరను రూ.73,999గా ఉంది. మరోవైపు, ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో వచ్చిన MG Pro+ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ధర పరంగా ఈ రెండు మోడళ్ల మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో అవసరాలకు అనుగుణంగా వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

డిజైన్ చూసినట్లయితే, కోమాకి MG Pro V, MG Pro+ స్కూటర్లు సింపుల్‌గా కనిపించినప్పటికీ, కొత్త స్టైలింగ్‌తో ఆకట్టుకునేలా తయారు చేశారు. బాడీ లైన్స్‌ను మరింత ప్రీమియంగా కనిపించేలా చేయడంతో పాటు, LED ఇండికేటర్లను బాడీ ప్యానెల్స్‌లోనే ఇవ్వడం వల్ల ఈ స్కూటర్లకు ప్రత్యేకమైన లుక్ వచ్చింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వీటిని బ్లాక్, ఫ్రాస్ట్ వైట్, గార్నెట్ రెడ్, మెటల్ గ్రే అనే నాలుగు కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
వీటిలో మెటల్ గ్రే కలర్ మరింత ప్రీమియం, క్లాసీ లుక్‌ను అందిస్తుంది. ఈ రెండు మోడళ్లలోనూ BLDC హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. అయితే బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ విషయంలో తేడా ఉంటుంది. MG Pro Vలో 2.2 kWh లిథియం-ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌ను అందించగా, ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ధృవీకరించబడిన రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

మరోవైపు, MG Pro+ లో 2.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీని ద్వారా ఒక్కసారి ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కోమాకి పేర్కొంది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లను సుమారు 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అలాగే, రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లుగా ఉండటంతో, సిటీ రేంజ్‌లో రోజువారీ ప్రయాణాలకు ఇవి బెస్ట్ ఎంపికగా నిలుస్తాయని చెప్పవచ్చు.
వీటిలో అందించిన ఫీచర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండటం విశేషం. ఇందులో పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్‌తో పాటు కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ లాక్, పార్క్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి రోజువారీ వాడకాన్ని మరింత సౌకర్యవంతంగా, సేఫ్టీగా మార్చేలా రూపొందించబడ్డాయి. రైడింగ్ కంఫర్ట్ కోసం ముందు భాగంలో 12 అంగుళాల వీల్, వెనుక 10 అంగుళాల వీల్‌ను అందించారు.

సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. బ్రేకింగ్ కోసం డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్‌ను అందించారు. వినియోగదారులకు మరింత నమ్మకాన్ని కల్పించేలా బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ వంటి వాటిపై 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీని కోమాకి ప్రకటించింది. ఈ వారంటీతో కొనుగోలుదారులు ఎక్కువ కాలం పాటు ఎలాంటి ఆందోళన లేకుండా స్కూటర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.







