Home Business వాహనదారులకు షాకింగ్.. E20 పెట్రోల్‌తో పాత బండ్లు ఖరాబ్ కావడం గ్యారెంటీ.. నివేదికలో సంచలనాలు

వాహనదారులకు షాకింగ్.. E20 పెట్రోల్‌తో పాత బండ్లు ఖరాబ్ కావడం గ్యారెంటీ.. నివేదికలో సంచలనాలు

4
0

వాహనదారులకు షాకింగ్.. E20 పెట్రోల్‌తో పాత బండ్లు ఖరాబ్ కావడం గ్యారెంటీ.. నివేదికలో సంచలనాలు

భారతదేశంలో వాహనాలు వాడుతున్న కోట్లాది మంది ఓనర్లకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజన్ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) రూపొందించిన ఒక సీక్రెట్ రిపోర్టు ద్వారా ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఈ E20 పెట్రోల్ వాడటం వల్ల ముఖ్యంగా పాత కార్లు, బైక్‌లలో ఉండే రబ్బర్ భాగాలు త్వరగా పాడైపోతాయని నివేదిక హెచ్చరించింది. ఇందులో ఇంధనాన్ని సరఫరా చేసే ఫ్యూయల్ పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్, ఓ-రింగ్స్ వంటి కీలకమైన విడిభాగాలు దెబ్బతినే అవకాశం ఉంది.

Google search engine

అసలేమిటీ E20 ఇంధనం?
కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ఎథనాల్ బ్లెండింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది. వాస్తవానికి అనుకున్న సమయం కంటే ఐదేళ్ల ముందే, అంటే ఏప్రిల్ 2025లోనే దేశవ్యాప్తంగా 20 శాతం ఎథనాల్ మిశ్రమంతో కూడిన E20 పెట్రోల్ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేసింది. ఇప్పుడు సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్‌ను కలుపుతున్నారు. అయితే ఈ నిర్ణయం పర్యావరణానికి మేలు చేసినప్పటికీ, పాత తరం వాహనాల ఇంజన్ల మన్నికపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలు ఇప్పుడు కార్లు, బైక్‌ల ఓనర్లలో మొదలయ్యాయి.

ARAI Secret Report Warns E20 Petrol May Damage Old Car Engines and Reduce Mileage

ఫోర్ వీలర్ల యజమానులకు టెన్షన్
రక రకాల ఇంజన్లపై E20 ఇంధనాన్ని వాడినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై ARAI ల్యాబ్స్ పరీక్షలు జరిపాయి. ఈ టెస్టింగ్‌లో విభిన్న ఇంజన్లు వేర్వేరు ఫలితాలను ఇచ్చాయి. ఫోర్-వీలర్ ఇంజన్ల విషయానికి వస్తే.. పాత బీఎస్-4 (BS-IV) ఇంజన్ పనితీరు ఈ ఇంధనంతో బాగానే ఉంది. కానీ, ఆధునిక బీఎస్-6 (BS-VI) టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను 265 గంటల పాటు పరీక్షించిన తర్వాత కొన్ని సమస్యలు తలెత్తాయి.

అంతకంటే షాకింగ్ విషయమేమిటంటే.. ఒక ప్రముఖ కార్ల తయారీ సంస్థకు చెందిన ఇంజన్‌ను 809 గంటల పాటు నిరంతరాయంగా టెస్ట్ చేయగా, దాని ఎగ్జాస్ట్ వాల్వ్‌లో థర్మోమెకానికల్ ఫెయిల్యూర్ సంభవించింది. అంటే ఇంజన్‌లో విపరీతమైన వేడి, ఒత్తిడి పెరిగిపోవడం వల్ల వాల్వ్ వంగిపోవడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. అయితే ఈ ఫెయిల్యూర్ వెనుక కేవలం E20 పెట్రోల్ మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ARAI Secret Report Warns E20 Petrol May Damage Old Car Engines and Reduce Mileage

టూ వీలర్ల వినియోగదారులకు ఊరట
కార్ల ఇంజన్ల రిపోర్ట్ కాస్త ఆందోళన కలిగించినప్పటికీ, టూ-వీలర్స్ విషయంలో మాత్రం మంచి ఫలితాలు వచ్చాయి. దేశంలోని మూడు పెద్ద టూ-వీలర్ కంపెనీలు జరిపిన అంతర్గత పరీక్షల్లో బైక్‌ల ఇంజన్లలో ఎలాంటి లోపాలు లేదా క్రాష్‌లు కనిపించలేదు. E20 పెట్రోల్‌పై బైక్‌ల పనితీరు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నట్లు తేలింది.

అంతేకాకుండా, ఈ పరీక్షల్లో వాహనాల్లోని మెటల్ (ఇనుము లేదా అల్యూమినియం) భాగాలపై ఎలాంటి చెడు ప్రభావం పడలేదని స్పష్టమైంది. ఈ కొత్త ఇంధనం వల్ల వాహనాలు వదిలే కాలుష్యం కూడా చట్టపరమైన పరిమితుల లోపే ఉంది. బండ్లను స్టార్ట్ చేయడంలో గానీ, రోడ్డుపై నడపడంలో గానీ పెద్దగా ఇబ్బందులు ఏవీ రాలేదు. కానీ, పాత పెట్రోల్ (E10)తో పోలిస్తే ఈ E20 పెట్రోల్ వాడకం వల్ల మైలేజ్ కొంత మేర తగ్గినట్లు రికార్డైంది.

మైలేజ్ తగ్గుతోందా?
ప్రస్తుతం వాహనదారులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య బండి లైఫ్ మరియు మైలేజ్ తగ్గిపోవడం. ముఖ్యంగా 2012 కంటే ముందు తయారైన వాహనాలు, అలాగే ఏప్రిల్ 2023 కంటే ముందు వచ్చిన కొన్ని మోడళ్లకు E20 పెట్రోల్ వాడకానికి తగిన సర్టిఫికేషన్ లేదు. ఆటోమొబైల్ ఇంజనీర్ల ప్రకారం.. ఎథనాల్‌కు సాధారణ పెట్రోల్ కంటే గాల్లోని తేమను చాలా వేగంగా ఆకర్షించే గుణం ఉంటుంది.

దీనివల్ల బైక్ లేదా కార్ల ఫ్యూయల్ ట్యాంక్, ఇంధన పైపుల్లో లోపలి వైపు తుప్పు పట్టే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. పాత బండ్లలో ఉండే ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు దీనివల్ల మెత్తబడిపోతాయి. చలికాలంలో బండ్లు స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతాయనే అంచనాలు ఉన్నప్పటికీ, ఆ సమస్యను కార్ల కంపెనీలు తోసిపుచ్చాయి.

ఆటోమొబైల్ దిగ్గజాల స్పందన
ఇలాంటి ఎన్నో అనుమానాలు, భయాలు ఉన్నప్పటికీ దేశంలోని అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా, హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలు E20 పెట్రోల్ వాడకానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. ల్యాబ్‌లలో ఎన్నో ఏళ్లుగా జరిపిన పరీక్షలు, క్షేత్రస్థాయి అనుభవాలను పరిశీలించిన తర్వాతే ఈ ఇంధనం సురక్షితమైనదని తేల్చినట్లు కంపెనీలు చెప్తున్నాయి.

టయోటా సంస్థకు చెందిన విక్రమ్ గులాటి మాట్లాడుతూ.. భారతదేశంలో జరుగుతున్న ఇంధన టెస్టింగ్ విధానాలన్నీ అంతర్జాతీయ యూఎన్ఈసిఈ (UNECE) ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఎథనాల్ బ్లెండింగ్‌ను మరింత పెంచేందుకు తదుపరి దశ పనులను కూడా మొదలుపెట్టింది. భవిష్యత్తులో దేశంలో E85, E100 ఇంధనాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here