- పట్టించుకోని పంచాయతీ పాలకులు, అధికారులు
- రైలింగ్ విరిగిపోయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం
- మరమ్మతులు చేయకుంటే ఆందోళన తప్పదు: యువ నాయకుడు హరీష్ గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : మహనీయుల విగ్రహాల రక్షణ, గౌరవాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లి గ్రామంలో ప్రతిష్టించిన రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం అధికారుల, స్థానిక పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని యువ నాయకుడు హరీష్ గౌడ్ అన్నారు. విగ్రహం చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్టీల్ రైలింగ్ విరిగి ప్రమాదకరంగా పడి ఉన్నా.. స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ కానీ, పంచాయతీ అధికారులు కానీ కన్నెత్తి చూడకపోవడంపై మండిపడ్డారు.దేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ విగ్రహ పరిసరాలను పవిత్రంగా ఉంచాల్సింది పోయి, ఇలా అస్తవ్యస్తంగా మార్చడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జయంతి, వర్ధంతి ఉత్సవాల రోజుల్లో మాత్రమే వచ్చి, పూలమాలలు వేసి ఫొటోలకు పోజులిచ్చే నాయకులకు.. మిగతా రోజుల్లో విగ్రహ సంరక్షణ పట్టదా? హరీష్ నిలదీస్తున్నారు. ఈ విషయమై గ్రామ యువ నాయకుడు హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక పంచాయతీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విరిగిపోయిన రైలింగ్‌కు తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి, విగ్రహ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చాలన్నారు. అధికారులు, పాలకులు ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలని, లేనిపక్షంలో గ్రామస్తులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.




