- స్థానిక వార్డు ప్రజలు, అంగన్‌వాడీ చిన్నారుల భాగస్వామ్యం
- విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ
జనవాహిని ప్రతినిధి, తాండూరు: తాండూరు పట్టణంలోని 25వ వార్డులో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్థానిక ప్రజలు మరియు చిన్నారుల సమక్షంలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ నసీరా భాను మరియు అజాజ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులతో కలిసి మువ్వన్నెల జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ నసీరా భాను జాతీయ జెండాను ఆవిష్కరించగా, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు మరియు అంగన్‌వాడీ పిల్లలు ఏకమై జాతీయ గీతాన్ని ఆలాపించారు. భారత్ మాతాకీ జై, జై హింద్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. స్వాతంత్య్ర దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని అంగన్‌వాడీ చిన్నారుల విద్యావసరాల కోసం కౌన్సిలర్ తన సొంత ఖర్చులతో నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, రంగులు మరియు ఇతర విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు తీపి పదార్థాలను పంపిణీ చేశారు.
ఈ వేడుకలను ఉద్దేశించి కౌన్సిలర్ ಮಾತನಾడుతూ… చిన్నతనం నుంచే పిల్లలలో దేశభక్తి, క్రమశిక్షణ అలవరచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనకిది ఉచితంగా వచ్చిన స్వాతంత్య్రం కాదు; ఎందరో అమరవీరులు, జాతీయ నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే సిద్ధించిన మహత్తర స్వేచ్ఛ. వారి త్యాగాలను మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. ప్రతి ఒక్కరూ దేశం పట్ల, మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల గౌరవభావంతో మెలగాలి” అని పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో కూడా వార్డు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి, పిల్లల నాణ్యమైన విద్యకు తమవంతు పరిపూర్ణ సహకారం అందిస్తామని కౌన్సిలర్ అజాజ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు మరియు పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
