posted on Mar 29, 2024 4:56PM

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి ‘వారాహి విజయభేరి’ అని నామకరణం చేశారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే పవన్ తన వారాహి విజయభేరి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలి సభ ఈ నెల 30న చేబ్రోలు రామాలయం సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. 

కాగా, పవన్ ప్రచార కార్యక్రమాల్లో భద్రతా వ్యవహారాల సమన్వయకర్తలుగా అందె నరేన్, మిథిల్ జైన్ లను నియమించారు. వీరి నియామకానికి పవన్ ఆమోద ముద్ర వేశారు. 

జనసేన ఈ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో, మూడు విడతల్లో పవన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఎన్నికల ప్రచార బరిలో కత్తులు దూస్తుండగా, ఇక పవన్, నారా లోకేశ్ ఎంట్రీ ఇవ్వడమే మిగిలుంది. చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట సభలకు హాజరవుతున్నారు.

ఈ నెల 30 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు  పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. 

మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పిఠాపురానికి  పవన్ రానున్నారు. ఏప్రిల్ 3 – తెనాలి, ఏప్రిల్ 4 – నెల్లిమర్ల, ఏప్రిల్ 5 – అనకాపల్లి, ఏప్రిల్ 6 – యలమంచిలి, ఏప్రిల్ 7 – పెందుర్తి,ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్ ,ఏప్రిల్ 10-రాజోలు, ఏప్రిల్ 11 – పి.గన్నవరం, ఏప్రిల్ 12 – రాజానగరం లో పవన్ పర్యటించనున్నారు.