- తాండూర్‌లో రూ.290 కోట్లతో ‘హ్యామ్’ రోడ్డు పనులకు శంకుస్థాపన
- కొడంగల్ తర్వాత తాండూర్‌కే అత్యధిక నిధులు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- ప్రపంచస్థాయి రహదారుల నిర్మాణమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శ్రీధర్ బాబు
- అంతారంలో భూమిపూజ.. కందనెల్లిలో ఘనంగా ‘ప్రగతి సభ’
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు లో రాష్ట్ర మంత్రులు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శనివారం తాండూరు లోని అంతారం గ్రామ పరిధిలో దాదాపు రూ. 290 కోట్ల వ్యయంతో అత్యున్నత సాంకేతిక విధానమైన ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ ద్వారా చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం కందనెల్లి పరిధిలోని జిపీఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి సభ లో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ తర్వాత ఉమ్మడి జిల్లాలో అత్యధిక నిధులను తాండూర్‌కే కేటాయించామని స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచస్థాయి రహదారులను నిర్మించడమే తమ ప్రజా ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని అన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన ‘హ్యామ్’ విధానంలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం వల్ల దీర్ఘకాలిక నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లపైనే ఉంటుందని, తద్వారా నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా మన్నికైన రోడ్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ నూతన రహదారుల ద్వారా ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుందని, తద్వారా వ్యవసాయ, వాణిజ్య రంగాలు వేగవంతమై గ్రామీణ అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ పనులను సత్వరమే పూర్తి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.ఈ ప్రగతి ప్రస్థాన మహోత్సవంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, కల్వ సుజాత, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా, మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ నీరజ బాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.