సింగిల్ ఛార్జ్‌తో 187 కిమీ.. గంటకు 90కిమీ వేగం.. ఈ స్కూటరును చూస్తే ఇట్టే ప్రేమలో పడిపోతారు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ మోబిలిటీ బ్రాండ్ Vida నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి పాపులర్ ఈ-స్కూటర్లకు గట్టి పోటీని ఇచ్చే విధంగా దీనిని రూపొందించారు. దీనికి Vida VX2 Plus అని పేరు పెట్టారు. మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ధరను ఎక్స్-షోరూమ్ వద్ద రూ.1,43,990గా కంపెనీ నిర్ణయించింది. విడా VX2 ఫ్యామిలీలో ఇది నాలుగో మోడల్ కావడం విశేషం.
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అవ్వడానికి ముందే ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఒక క్రాస్-కంట్రీ రైడ్‌లో పాల్గొని ఏకంగా 12,111 కిలోమీటర్ల ప్రయాణాన్ని విజయవంతగా పూర్తి చేసుకుంది. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ స్కూటర్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. లాంగ్ రైడ్స్ చేయాలనుకునే వారికి కూడా ఇది ఎంతో నమ్మకమైన వాహనమని కంపెనీ ఈ రికార్డు ద్వారా నిరూపించింది.

రెండు రిమూవేబుల్ బ్యాటరీల స్పెషాలిటీ
ఈ విడా VX2 ప్లస్ స్కూటర్ లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, ఇందులో రెండు విడి విడి బ్యాటరీలను అందించారు. ఒక్కో బ్యాటరీ కెపాసిటీ 2.2 kWh కాగా, రెండు కలిపి మొత్తం 4.4 kWh లిథియం-ఆయాన్ బ్యాటరీ ప్యాక్‌గా మారుతుంది. ఈ రిమూవేబుల్ బ్యాటరీల వల్ల అపార్ట్‌మెంట్లలో ఉండేవారు లేదా పార్కింగ్ ప్లేస్‌లో ఛార్జింగ్ పాయింట్ లేని వారు బ్యాటరీలను సులభంగా విడదీసి, తమ ఇంట్లోకి లేదా ఆఫీస్‌లోకి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవచ్చు. కస్టమర్ల ప్రధాన సమస్య అయిన ఛార్జింగ్ ఇబ్బందులను ఈ ఫీచర్ పూర్తిగా దూరం చేసేస్తుంది.
టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు
ఈ స్కూటర్ మైలేజ్ పరంగానే కాకుండా పర్ఫార్మెన్స్ పరంగానూ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకేసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది IDC సర్టిఫైడ్ ప్రకారం ఏకంగా 187 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో 6 కిలోవాట్ పీక్ అవుట్‌పుట్ ఇచ్చే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇది 26 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని సహాయంతో ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. రైడర్ల సౌకర్యార్థం ఇందులో ఈకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. ఓవర్‌టేక్ చేసే సమయంలో ఎక్స్ ట్రా స్పీడ్ కోసం ప్రత్యేకంగా ఒక బూస్ట్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఛార్జింగ్ సమయాన్ని తగ్గించేందుకు హీరో సంస్థ ఈ స్కూటర్‌తో పాటు ఇండస్ట్రీలోనే మొదటిసారిగా 1 కిలోవాట్ పోర్టబుల్ ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఛార్జర్ సాయంతో ఇంట్లోనే కేవలం 3 గంటల 30 నిమిషాల్లో బ్యాటరీని సున్నా నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా అత్యవసరంగా బయటకు వెళ్లాలనుకుంటే, ఇందులో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 6000 కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కస్టమర్లు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.
స్మార్ట్ ఫీచర్ల ఫ్యాక్టరీ
విడా VX2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అడ్వాన్సుడ్ టెక్నికల్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో 4.3 ఇంచుల TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను అమర్చారు. దీనికి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయం ఉండటం వల్ల ఫోన్ కాల్స్, మెసేజ్ అలర్ట్స్ డిస్‌ప్లేపైనే చూసుకోవచ్చు. దారి వెతుక్కునేందుకు వీలుగా టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోసం ఓవర్-ది-ఎయిర్ (OTA) సపోర్ట్ కూడా ఉన్నాయి. ఇక ప్రయాణంలో లగేజీ పెట్టుకునేందుకు సీటు కింద 27.2 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. బ్రేకింగ్ సిస్టమ్ మరింత సురక్షితంగా ఉండేందుకు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) టెక్నాలజీని కూడా ఇందులో జోడించారు.