- పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే జీవో 97ను రద్దు చేయాలి
- జీవో 97తో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం
- విద్యాశాఖ నిర్ణయాలు ఏకపక్షం
- రాజ్ కుమార్ కందుకూరి
జనవాహిని ప్రతినిధి తాండూరు; రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను గతంలో మాదిరిగానే సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ… పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య సాంకేతిక నైపుణ్యాలను అందించడమే కాకుండా, త్వరితగతిన ఉపాధి, ఉద్యోగ మరియు ఉన్నత విద్యా అవకాశాలకు బలమైన మార్గంగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణులతో ఎలాంటి చర్చలు జరపకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని విమర్శించారు.
విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, విద్యావేత్తల సలహాలు స్వీకరించి జీవో 97ను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణ కోసం వారు చేపట్టే ప్రతి ప్రజాస్వామ్య పోరాటానికి బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని, వారితో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
