నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా ఈజీగా అప్లై చేసుకోండి..!
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను ఆరో క్లాసులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఐదో తరగతి పూర్తయినవారు.. ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్నవారు అర్హులుగా ఉంటారు. ఈ ఏడాది నవంబర్ 28న ఎంట్రాన్స్ టెస్ట్ ఉంటుంది. మార్చి లేదా ఏప్రిల్ లో ఫలితాలను విడుదల చేస్తారు. అలా మెరిట్ ఆధారంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 665 విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంపిక ప్రక్రియ ఎలా..?
జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థులు ఆరో తరగతి నుంచి నుంచి 12 వ తరగతి వరకూ నిశ్చింతగా చదువుకునే సువర్ణావకాశం ఉంది. ఇక్కడ చదువుతోపాటు గేమ్స్, సమగ్ర వికాసానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 665 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణ లో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలోనే ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. వీటిల్లో ప్రవేశాలకు మొత్తం రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు.
ఇక ఈ పరీక్షను విద్యార్థులు ఒకసారి మాత్రమే రాయడానికి అర్హత ఉంటుంది. మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించగా మిగతా 25 శాతం సీట్ల కోసం ఎవరైనా పోటీ పడొచ్చు. అయితే గ్రామీణ కోటాలో సీటు కోసం పోటీ పడే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా ఏదైనా గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇక అలాగే మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయిస్తారు. అలాగే ఎస్టీలకు 7.5, ఎస్సీలకు 15, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు కొన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి.

పరీక్ష విధానం..?
నవోదయ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 2 గంటల వ్యవధి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు, ఆర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు.. అలాగే లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థి హిందీ, తెలుగు, ఇంగ్లిష్ ఇలా కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసే వీలు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. ఇక నెగెటివ్ మార్కులు ఉండవు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ అయిన navodaya.gov.in లేదా cbseitms.rcil.gov.in ను సంప్రదించాలి.







