HomeNewsకాగ్నా చెంతన.. కన్.. (నీటి) తిప్పలు...!

కాగ్నా చెంతన.. కన్.. (నీటి) తిప్పలు…!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • కాగ్నా చెంతన.. గొంతుకల ఎండుట..!
  • ఎల్మకన్నలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్
  • వ్యవసాయ బోరు బావులే దిక్కు.. మహిళల ఆవేదన
  • నీరు లేక విలవిలలాడుతున్న మూగజీవాలు
  • ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

జనవాహిని ప్రతినిధి తాండూరు : పక్కనే కాగ్నా నది గలగలా పారుతున్నా.. ఆ గ్రామస్తులకు మాత్రం చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొంది. తాండూర్ మండలంలోని ఎల్మకన్న గ్రామంలో గత వారం రోజులుగా తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. ఇది ప్రజా పాలనా? లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమా? అంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అరకొర ‘భగీరథ’.. వారం రోజులుగా నిలిచిన సరఫరా

గ్రామంలో మిషన్ భగీరథ నీరు వస్తున్నప్పటికీ, అది ఏమాత్రం చాలీచాలకుండా ఉంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు వారం రోజుల క్రితం ఇక్కడి పంపు రిపేరుకు గురవడంతో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో చేసేదేమీ లేక, మంచినీటి కోసం గ్రామస్తులు మైళ్ల దూరం నడుచుకుంటూ పొలాల్లోని వ్యవసాయ బోరు బావులను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.

నిర్వహణ కరువై.. ట్యాంకులు అపరిశుభ్రం..

గ్రామంలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. అటు పశువుల దాహం తీర్చడానికి నిర్మించిన మూడు నీటి తోట్లు ఎండిపోయి, చుక్క నీరు లేక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. కనీసం వీటిని కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గ్రామస్తులు మండిపడుతున్నారు.

అధికారులారా స్పందించండి.. లేదంటే ‘బిందెల ప్రదర్శన’ తప్పదు!

గ్రామంలో సమస్యలు తాండవిస్తున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారా.. లేరా..? అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే, గ్రామ మహిళలంతా ఏకమై మండల కేంద్రంలో బిందెలతో పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments