Saturday, June 13, 2026

― Advertisement ―

యువకుడిపై తప్పుడు కేసు..?

ప్రమాదమా.. హత్యాయత్నమా..? విచారణ పూర్తికాకముందే రిమాండ్‌తో ఉద్యోగ అవకాశం కోల్పోయిన యువకుడు  పెద్దేముల్ పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీకి తండ్రి ఆవేదనతో కూడిన ఫిర్యాదు ఇది కేవలం ప్రమాదమే’ అని స్పష్టం...
HomeNEWSయువకుడిపై తప్పుడు కేసు..?

యువకుడిపై తప్పుడు కేసు..?

spot_img
  • ప్రమాదమా.. హత్యాయత్నమా..?
  • విచారణ పూర్తికాకముందే రిమాండ్‌తో ఉద్యోగ అవకాశం కోల్పోయిన యువకుడు
  •  పెద్దేముల్ పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీకి తండ్రి ఆవేదనతో కూడిన ఫిర్యాదు
  • ఇది కేవలం ప్రమాదమే’ అని స్పష్టం చేస్తున్న ఫిర్యాదుదారుల కుటుంబ సభ్యులు

జనవాహిని ప్రతినిధి తాండూరు :  ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఓ యువకుడి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పిందని బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఒక చిన్న ఘటనలో కనీస ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే, అత్యంత తొందరపాటుతో ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ఈ అతి ఉత్సాహం కారణంగా సదరు యువకుడు కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖకు సంబంధించిన కీలకమైన ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయాడని, ఫలితంగా కష్టపడి సాధించుకున్న ఉద్యోగావకాశంతో పాటు అతని భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారంలో పడిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు.

అసలేం జరిగిందంటే..?వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి శ్రీనివాస్ కుమారుడు అనిర్వేష్ (20) ఈ నెల 2వ తేదీన గ్రామంలో తన స్కూటీపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన బుల్లెట్ మోటార్ సైకిల్ అనుకోకుండా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌లపై ఉన్న ఇద్దరూ కిందపడిపోగా, బుల్లెట్ నడుపుతున్న జాఫర్ అనే యువకుడి చేతికి స్వల్ప ఫ్రాక్చర్ అయింది. రోడ్డుపై వెళ్లేటప్పుడు సాధారణంగా జరిగే ఈ ఘటనపై జాఫర్ సోదరుడు మోహిజ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అయితే, ఈ ఫిర్యాదు ఆధారంగా పెద్దేముల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ప్రశాంత్ వర్ధన్ సంఘటన స్థలాన్ని సమగ్రంగా పరిశీలించకుండా, ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాల సేకరణ గానీ, చుట్టుపక్కల వారి విచారణ గానీ చేపట్టకుండానే అనిర్వేష్‌పై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఈ నెల 8న రిమాండ్‌కు తరలించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని, కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదం మాత్రమేనని ఇరుపక్షాల వారు పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ, అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్నారు.పోలీసులు హడావుడిగా రిమాండ్‌కు తరలించడం వల్ల ఈ నెల 9వ తేదీన జరగాల్సిన కేంద్ర పోస్టల్ శాఖ ఉద్యోగ ఇంటర్వ్యూకు అనిర్వేష్ హాజరుకాలేకపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగ అంచుల దాకా వెళ్లిన యువకుడి జీవితం, పోలీసుల విధి నిర్వహణ లోపం వల్ల ఇప్పుడు జైలు పాలు కావాల్సి వచ్చిందని వాపోతున్నారు.మరోవైపు ఈ ఘటనలో గాయపడిన జాఫర్, ఫిర్యాదు చేసిన అతని సోదరుడు మోహిజ్ వారి కుటుంబ సభ్యులు సైతం ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి ఉద్దేశపూర్వక చర్య గానీ, పాత కక్షలు గానీ లేవని చెబుతున్నారు. అవసరమైతే జిల్లా ఉన్నతాధికారుల ఎదుట హాజరై వాస్తవాలను వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వారు ప్రకటించడం గమనార్హం.కేసు నమోదు చేసిన విధానం, దర్యాప్తు ప్రక్రియ, మరియు రిమాండ్‌కు పంపిన తొందరపాటుపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని బాధితుడి తండ్రి మర్పల్లి శ్రీనివాస్ జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, ఒక యువకుడి జీవితాన్ని నాశనం చేసేలా ప్రవర్తించిన సదరు పోలీస్ అధికారిపై శాఖాపరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆయన ఉన్నతాధికారులను వేడుకున్నారు.