- ప్లాట్‌లోకి చొరబడి రేకుల షెడ్, ఫెన్సింగ్ ధ్వంసం
- మేకల ఫారమ్‌పై దాడి.. సామాగ్రి అపహరణ
- వెంకటేష్, ప్రకాష్‌తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు
జనవాహిణి ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణ కేంద్రంలో గురువారం ఒక సివిల్ వివాదంలో కొందరు వ్యక్తులు జేసీబీతో దౌర్జన్యానికి దిగారని మాజీ కౌన్సిలర్ కేసు నమోదు చేశారు. లీజుకు తీసుకున్న స్థలంలో నిర్మించుకున్న మేకల ఫారమ్ రేకుల షెడ్‌ను, రక్షణ ఫెన్సింగ్‌ను జేసీబీతో కూల్చివేసి, సామాగ్రిని తరలించారనే ఘటనపై తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తాండూర్ గ్రీన్ సిటీ నివాసి, మాజీ ఫ్లోర్ లీడర్, శ్రీనివాస్ రెడ్డి పట్టణంలోని సర్వే నంబర్ 212 లో గల ప్లాట్ నంబర్ 28ను గత 2021 సంవత్సరం నుండి చట్టబద్ధంగా లీజుకు తీసుకుని వాడుకుంటున్నారు. సదరు స్థలంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి, లోపల రేకుల షెడ్ నిర్మించి మేకల ఫారమ్ నిర్వహిస్తున్నారు.గురువారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో నిందితులు ఆర్. వెంకటి, ప్రకాష్ తమ అనుచరులతో కలిసి దౌర్జన్యంగా ప్లాట్‌లోకి చొరబడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్లాన్ ప్రకారం తమతో తెచ్చుకున్న జేసీబీ తో మేకల షెడ్‌ను, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పిల్లర్లను పూర్తిగా కూల్చివేశారు.ఈ హఠాత్ పరిణామంతో తనకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు తాండూర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్. వెంకటి (A-1), ప్రకాష్ (A-2) లతో పాటు వారి వెంట వచ్చిన మరో ఏడుగురు అనుచరులపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 329(3), 324(4), 303(2) r/w 3(5) కింద కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ బొంగు పరమేశ్వర్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పట్టణ నడిబొడ్డున జేసీబీతో జరిగిన ఈ దాడి స్థానిక వ్యాపార వర్గాల్లో, రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




