- అరగంట పాటు షాపులోనే బంధించి దౌర్జన్యం
- ఫొటోలు ఎలా తీస్తారంటూ వ్యాపారుల బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో బంగారం వ్యాపారుల ఆగడాలు మితిమీరాయి. తమ షాపుల గుట్టును బయటపెట్టేందుకు ప్రయత్నించిన ఓ పత్రికా విలేకరిపై వ్యాపారులు దౌర్జన్యానికి దిగారు. విలేకరిని అరగంటకు పైగా నిర్బంధించి, తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడిన ఘటన ఈ నెలలో పట్టణంలో కలకలం రేపింది.పట్టణంలోని స్వర్ణకారుల సంఘం, జువెలరీ వ్యాపారుల యూనియన్ ఆధ్వర్యంలో బంగారం స్వచ్ఛతను పరీక్షించే కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే, ఈ దుకాణాలు ప్రధాన రహదారులకు దూరంగా, షాపింగ్ కాంప్లెక్స్‌ల లోపలి భాగంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్న ఓ విలేకరి ఈ నెలలో ఒక రోజు ఉదయం ఆ దుకాణాల వద్ద ఫొటోలు తీశారు.దీనిని గమనించిన అజయ్ అనే షాపు నిర్వాహకుడు, విలేకరిని అడ్డుకుని ఫొటోలు డిలీట్ చేయాలని ఒత్తిడి చేశారు. అనంతరం ఆయన్ని యూనియన్ నేతల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న జువెలరీ వ్యాపారి శెట్టి రమేష్ విలేకరి పై విరుచుకుపడ్డారు. నీకు ఫొటోలు తీసే అధికారం ఎవరు ఇచ్చారు? అంటూ బెదిరించి, బలవంతంగా ఫోన్ లాక్కుని ఫొటోలను డిలీట్ చేశారు. అప్పటికీ ఆగకుండా, ఎవరు తీయమన్నారు? వారు ఇక్కడికి రావాలి అంటూ అరగంటకు పైగా విలేకరిని షాపులోనే నిర్బంధించారు.ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వ్యాపారులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడు కూడా తాండూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను నిర్బంధించిన వ్యాపారులపై ఫిర్యాదు చేశారు. తన వృత్తిని అగౌరవపరిచినందుకు, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.





