- బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
- ఒకరి కాలుపై నుంచి దూసుకెళ్లిన వెనుక టైర్
- క్షతగాత్రులు సీసీఐ కాలనీ, నాగారం వాసులు
- తాండూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స
జనవాహిని ప్రతినిధి, తాండూరు : తాండూరు పట్టణంలో శనివారం గౌతపూర్ రోడ్డు మార్గంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక నాపరాతి లోడ్ ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రక్తసిక్తమై తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన రాధాకృష్ణ, ధరూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన బాబు కలిసి ద్విచక్ర వాహనంపై గౌతపూర్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ సీసీఐ కాలనీలోకి మలుపు తిరుగుతున్న క్రమంలో, గౌతపూర్ రోడ్డు మార్గం నుండి వస్తున్నా నాపరాతి లోడ్‌తో వేగంతో దూసుకొచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది.ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో బైక్ పైనున్న ఇద్దరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ క్రమంలోనే ప్రమాద తీవ్రతకు రాధాకృష్ణ అనే వ్యక్తి కాలుపై నుంచి ట్రాక్టర్ వెనుక టైర్ దూసుకెళ్లింది. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ కాగా, తలకు కూడా బలమైన గాయాలయ్యాయి. బైక్‌పై ఉన్న మరో వ్యక్తి బాబుకు సైతం ఒంటిపై పలుచోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న రాధాకృష్ణను, బాబును స్థానికులు తక్షణమే తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పట్టణంలో నాపరాతి లోడ్ వాహనాల అతివేగంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.





